ములుగు, 2026-08-01
ములుగు జిల్లా వెంకటాపురం మండలం పాలెం ప్రాజెక్టు దిగువన గోదావరి వరద ఉధృతి కొనసాగుతోంది. టేకులబోర్, పాత్రపురం మధ్య బలకట్టు వాగు వద్ద కిలోమీటరు మేర నీరు చేరడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కనీస పడవ సౌకర్యం లేకపోవడం, అధికారుల పర్యవేక్షణ కొరవడటంతో యువత ప్రమాదకరంగా రోడ్లపై బైక్ రైడింగ్‌కు పాల్పడుతున్నారు.
ములుగు జిల్లా వెంకటాపురం మండలం పాలెం ప్రాజెక్టు దిగువన ఉన్న టేకులబోర్, పాత్రపురం మధ్య బలకట్టు వాగు వద్ద గోదావరి వరద నీరు కిలోమీటరు మేర చేరడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కనీసం పడవ సౌకర్యం కూడా కల్పించకపోవడంతో ప్రజలు, ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గోదావరి నీరు తగ్గుముఖం పట్టిందనగానే, రోడ్లపైకి చేరిన నీటిలో యువత నిర్లక్ష్యంగా బైక్ రైడింగ్ చేస్తున్నారు. అధికారులు, పంచాయతీ సిబ్బంది కూడా అందుబాటులో లేకపోవడంతో యువత విచ్చలవిడిగా రోడ్డుపై నిలిచిన గోదావరి వరద నీటిని దాటుతూ ప్రమాదకరమైన రైడింగ్‌కు పాల్పడుతున్నారు. అధికారుల పర్యవేక్షణ పూర్తిగా కరువవడంతో, ఏదైనా ప్రమాదం జరిగితేనే వారు స్పందిస్తారేమోనని ప్రజలు వాపోతున్నారు.
ప్రధాన రహదారిపై గోదావరి వరద నీరు ఉన్నప్పటికీ, కనీసం భారీ గేట్లను కూడా ఏర్పాటు చేయలేదు. పంచాయతీ సిబ్బంది, అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో యువత బైకులు, ట్రాక్టర్ల ద్వారా రోడ్లపైకి చేరిన గోదావరి నీటిని దాటేందుకు ప్రయత్నిస్తున్నారు. వరద నీరు పూర్తిగా తగ్గకముందే ప్రమాదకరంగా ప్రయాణిస్తున్న వాహనదారులకు, ప్రయాణికులకు నచ్చజెప్పేవారే కరువయ్యారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా సంబంధిత అధికారులు గోదావరి నీరు పూర్తిగా తగ్గే వరకు పర్యవేక్షణలో ఉండాలని ప్రజలు కోరుతున్నారు.










