ములుగు, 2026-07-30
ఏజెన్సీ ప్రాంతంలో ఐటీడీఏల ద్వారా జరుగుతున్న అన్యాయాలను నిరసిస్తూ, పలు డిమాండ్లతో ఆగస్టు 24న ఏటూరు నాగారం ఐటీడీఏ కార్యాలయాన్ని ముట్టడించాలని తుడుం దెబ్బ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో, భవిష్యత్ కార్యాచరణాలకై జులై 31న ఆదివాసి సంఘాల సమన్వయ సమావేశం నిర్వహించనున్నారు.
ఆదివాసి సమాజానికి తుడుం దెబ్బ పిలుపునిచ్చింది. ఏజెన్సీలో 'మనభూమి మన హక్కు మన అభివృద్ధి' శ్రీకారానికి ఆదివాసి సిద్ధంగా ఉన్నారని ప్రకటించింది. ములుగు జిల్లా ఏటూరు నాగారం ఐటీడీఏ కార్యాలయాన్ని శాంతియుత ర్యాలీ నిర్వహించేందుకు ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ రాష్ట్ర అధ్యక్షులు మైపతి అరుణ్ కుమార్ ఆదేశాల మేరకు ఆదివాసులు సన్నద్ధమవుతున్నారు.
ఏజెన్సీ ప్రాంతంలో ఐటీడీఏల ద్వారా జరుగుతున్న అన్యాయాలను నిరసిస్తూ, నెంబర్ జీవో 3ని పునరుద్ధరించాలని, 1/70 చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని, పేసా చట్టాన్ని పూర్తిగా అమలు చేయాలని, 29 శాఖలో ఐటీడీఏ ద్వారానే భర్తీ చేయాలని, ఎస్టీ జాబితా నుండి లంబాడీలను తొలగించాలని డిమాండ్లు చేస్తున్నారు.
ఈ డిమాండ్లతో తుడుం దెబ్బ జిల్లా అధ్యక్షులు నల్లబోయిన లక్ష్మణ్ దొర అధ్యక్షతన ఆగస్టు 24న ఏటూరునాగారం ఐటిడిఏ కార్యాలయాన్ని ముట్టడించేందుకు ములుగు జిల్లా అన్ని మండలాల నుండి ఆదివాసులు తరలిరానున్నారు. ఈ నేపథ్యంలో, భవిష్యత్ కార్యాచరణాలకై జులై 31వ తేదీన అన్ని ఆదివాసి సంఘాల కోఆర్డినేషన్ సమావేశం ఏటూరు నాగారం మండల కేంద్రంలోని గిరిజన భవనంలో రేపు ఉదయం 10 గంటలకు నిర్వహించనున్నారు.
ఈ సమావేశానికి ఆదివాసి యువతీ యువకులు, అన్ని మండలాల ఆదివాసి నాయకులు, మహిళలు, ఆదివాసి పెద్దలు, రైతులు హాజరు కావాలని కోరారు.











