ములుగు, 2026-06-05
ములుగు జిల్లా వాజేడు మండలంలోని అయ్యవారిపేట గ్రామంలో కాఫెడ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో సఖి సురక్షిత పథకంపై స్వయం సహాయక సంఘాల మహిళలకు అవగాహన సదస్సు నిర్వహించారు. మహిళలు, బాలికలు ఎదుర్కొంటున్న హింసల నుండి రక్షణ కల్పించడమే సఖి సెంటర్ ముఖ్య ఉద్దేశ్యమని ఈ సందర్భంగా తెలిపారు.
ములుగు జిల్లా వాజేడు మండల కేంద్రంలోని అయ్యవారిపేట గ్రామంలో కాఫెడ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో సఖి సురక్షిత పథకంపై స్వయం సహాయక సంఘాల మహిళలకు అవగాహన సదస్సు నిర్వహించారు. సంస్థ డైరెక్టర్ లూర్దు రాజు ఆదేశాల మేరకు జరిగిన ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన ఐసిడిఎస్, సీడబ్ల్యూ ప్రేమలత మేడం మాట్లాడుతూ, ప్రస్తుత సమాజంలో మహిళలు, బాలికలు ఎదుర్కొంటున్న వివిధ రకాల హింసల నుండి రక్షణ కల్పించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఏర్పాటు చేసిన కేంద్రమే సఖి సెంటర్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా మహిళలు, బాలికల కొరకు రక్షణ కవచంగా 181 హెల్ప్‌లైన్, షి టీమ్స్, డివిసెల్ లాంటి అనేక సంస్థలను ఏర్పాటు చేసి బాలికలు, మహిళల రక్షణకు భరోసా కల్పిస్తోందని తెలిపారు.
గత 20 సంవత్సరాలుగా స్త్రీలు, బాలికల హక్కుల కోసం పనిచేస్తున్న సఖి సురక్షిత కేంద్రాలు, ప్రస్తుత సమాజంలో స్త్రీలు, బాలికలు ఎదుర్కొంటున్న వివిధ రకాల వేధింపులు, గృహ హింసల నుండి రక్షణ కల్పించడానికి, వారికి అవసరమైన అన్ని సహాయ సహకారాలను అందించడానికి కృషి చేస్తున్నాయని ఆమె వివరించారు. గృహ హింస, పని చేసే చోట లైంగిక వేధింపులు, స్త్రీలు, పిల్లల అక్రమ రవాణా, విద్యా సంస్థలలో లైంగిక వేధింపులు, అత్యాచారాలు, యాసిడ్ దాడులు మొదలైన హింసల నుండి రక్షణ కల్పించడం, వారికి అవసరమైన అన్ని సహాయ సహకారాలను ఒకే చోట నుండి అందించడం సఖి సెంటర్ ప్రత్యేకత అని పేర్కొన్నారు.
హఠాత్తుగా కట్టుబట్టలతో ఇళ్ళ నుండి బయటికి వచ్చిన బాధిత స్త్రీల కోసం 0-5 రోజుల వరకు తాత్కాలిక వసతి, వారికి అవసరమైన వైద్య సేవలు, వారి తరపున కేసులు నమోదు, నష్ట పరిహారం, ఎఫ్.వి.ఆర్ చేయించడం వంటి సదుపాయాలను బాధిత స్త్రీలకు అందించి, వారు ఎదుర్కొంటున్న హింసల నుండి రక్షణ కల్పించడమే సఖి సెంటర్ ప్రధాన ఉద్దేశ్యమని తెలిపారు. ఈ సేవలన్నింటినీ అందించడానికి సఖి సెంటర్లో పూర్తి స్థాయి నైపుణ్యం కలిగిన సిబ్బంది 24 గంటలూ, 7 రోజూ అందుబాటులో ఉంటారని, ఒకసారి బాధిత స్త్రీ సఖి సెంటర్‌కు వస్తే, సఖి సెంటర్ అన్ని వేళలా ఆమెకు తోడుగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
అనంతరం, అయ్యవారిపేట గ్రామపంచాయతీ సర్పంచ్ మడకం బెని, ధర్మవరం సర్పంచు సుమతి, ఎస్సీ కార్పొరేషన్ జిల్లా కార్యదర్శి సల్లూరి సతీష్ ఆధ్వర్యంలో అయ్యవారిపేట గ్రామంలో ఏర్పాటు చేసిన ఉచిత కుట్టు మిషన్ నేర్చుకున్న రెండవ బ్యాచ్ 24 మందికి, కాఫెడ్ స్వచ్ఛత సంస్థ ఆధ్వర్యంలో సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో సఖి సురక్షిత ప్రాజెక్టు నుంచి కల్పన మేడం, వెంకటాపురం మండల కోఆర్డినేటర్ గొంది హనుమంతు, వాజేడు మండల కోఆర్డినేటర్ గొంది కామేశ్వరరావు, వాజేడు, వెంకటాపురం యానిమేటర్లు స్వరూప, రమాదేవి, భాస్కర్, ఉష, ఇందిర, పద్మ, సుజల, ప్రసాద్, దీపిక, స్వయం సహాయక సంఘాల సభ్యులు పాల్గొన్నారు.








