ములుగు, 2026-06-05
ఏజెన్సీ ప్రాంత ఆదివాసీల సమస్యల పరిష్కారం కోసం తుడుం దెబ్బ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 7న ములుగు జిల్లా ఏటూరు నాగారం ఐటీడీఏ కార్యాలయాన్ని ముట్టడించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో, వాజేడు, వెంకటాపురం మండలాల్లో ఆదివాసీ మార్చ్ కరపత్ర ఆవిష్కరణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
ఏజెన్సీ ప్రాంతంలోని ఆదివాసీల సమస్యల పరిష్కారం కోసం ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 7వ తేదీన ములుగు జిల్లా ఏటూరు నాగారం ఐటీడీఏ కార్యాలయాన్ని ముట్టడించే కార్యక్రమం నిర్వహించనున్నట్లు తుడుం దెబ్బ మండల అధ్యక్షులు తుర్స చంటి దొర తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించి వాజేడు, వెంకటాపురం మండలాల్లో ఆదివాసీ మార్చ్ కరపత్ర ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించనున్నారు. కరపత్ర ఆవిష్కరణ కార్యక్రమానికి ఆదివాసి అస్తిత్వం గురించి నిరంతరం ఆదివాసి సమస్యలపై పోరాటాలు చేస్తున్న యంగ్ డైనమిక్ లీడర్, ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మైపతి అరుణ్ కుమార్ ఆగస్టు 31వ తేదీన హాజరుకానున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా తుడుం దెబ్బ మండల అధ్యక్షులు తుర్స చంటి దొర మాట్లాడుతూ, లంబాడీలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలని, ఏజెన్సీ ప్రాంతంలో 1/70 చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని అన్నారు. పీసా చట్టాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయాలని, జీవో నంబర్ 3ను పునరుద్ధరించాలని ఆయన కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ శాఖలో విడుదల చేసే నోటిఫికేషన్లలో ఏజెన్సీ ప్రాంత ఆదివాసీ నిరుద్యోగులకు 75 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. అంగన్వాడీ కేంద్రాల్లో ఆదివాసీ మహిళలకు టీచర్/ఆయా పోస్టుల్లో తగిన రిజర్వేషన్ ప్రకారం నియమించాలని ఆయన సూచించారు.
ఆదివాసీల హక్కులు, ఉద్యోగ అవకాశాలు, చట్టాల అమలు కోసం నిర్వహిస్తున్న ఈ ఆదివాసీ మార్చ్‌ను విజయవంతం చేయడానికి వాజేడు, వెంకటాపురం మండలాల ఆదివాసీ యువత, యువకులు, ప్రజలు ఆగస్టు 31న జరిగే కరపత్ర ఆవిష్కరణ కార్యక్రమానికి అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని తుడుం దెబ్బ మండల అధ్యక్షులు తుర్స చంటి దొర విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి మిచ్చ సురేష్, ఉపాధ్యక్షులు మట్టి రమేష్, వర్కింగ్ ప్రెసిడెంట్ సోడి శ్రీను, కోశాధికారి కంతి సురేంద్ర, మండల సభ్యులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.








