Medchal–Malkajgiri/Uppal (సహస్ర) జూలై 11
పౌరుల భావ ప్రకటనా స్వేచ్ఛను అణచివేస్తూ, ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపిస్తూ ‘ప్రజాసంఘాల ఐక్య వేదిక’ ఆధ్వర్యంలో అమలాపురంలో నిరసన ప్రదర్శన జరిగింది. ప్రముఖ యూట్యూబర్ ‘ప్రశ్న రావణ్’పై వరస కేసులు, దేశద్రోహం వంటి కఠినమైన ‘ఉపా’ (UAPA) చట్టాన్ని ప్రయోగించడాన్ని నిరసిస్తూ ఈ ఆందోళన చేపట్టారు.
పౌరులందరికీ రాజ్యాంగం కల్పించిన భావ ప్రకటనా స్వేచ్ఛను అణచివేస్తూ, ప్రశ్నించే గొంతుకలపై అక్రమ కేసులు బనాయించడాన్ని తీవ్రంగా ఖండిస్తూ శనివారం అమలాపురం గడియార స్తంభం కూడలి వద్ద ‘ప్రజాసంఘాల ఐక్య వేదిక’ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఇటీవల అరెస్ట్ అయిన ప్రముఖ యూట్యూబర్ ‘ప్రశ్న రావణ్’పై వరస కేసులు, దేశద్రోహం వంటి కఠినమైన ‘ఉపా’ (UAPA) చట్టాన్ని ప్రయోగించడాన్ని నిరసిస్తూ ప్రజాస్వామ్యవాదులు, దళిత, బహుజన, మానవ హక్కుల సంఘాల నాయకులు పెద్ద ఎత్తున గళమెత్తారు.
సమాజంలోని లోపాలను, పాలకుల వైఫల్యాలను ప్రశ్నించే సామాజిక మాధ్యమాల ప్రతినిధులపై ‘ఉపా’ (UAPA) వంటి కఠిన సెక్షన్లను మోపడం దుర్మార్గమైన చర్య అని వక్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది కేవలం ‘ప్రశ్న రావణ్’పై జరిగిన దాడి మాత్రమే కాదని, ప్రశ్నించే ప్రతి సామాన్యుడిని భయభ్రాంతులకు గురిచేసే కుట్ర అని మండిపడ్డారు.
ఏ ప్రజాస్వామ్య వ్యవస్థ అయినా ప్రశ్నల ద్వారానే బలోపేతం అవుతుందని నేతలు స్పష్టం చేశారు. ఆధునిక సమాజం విమర్శలను స్వీకరించడం ద్వారానే నాగరికం అవుతుందని, భిన్నాభిప్రాయాలు ఉన్నంత మాత్రాన పౌరుల ప్రాథమిక మానవ హక్కులను కాలరాసే అధికారం ప్రభుత్వాలకు, అధికార యంత్రాంగానికి లేదని హెచ్చరించారు. భావ ప్రకటనను వికృతీకరిస్తూ, దిగజార్చే భాషగా చిత్రీకరించే ప్రయత్నాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించారు. ప్రజా సమస్యలను గట్టిగా అడిగే క్రమంలో వచ్చే వాదనలను సాకుగా చూపి అక్రమంగా జైలుకు పంపడం రాజ్యాంగ ఉల్లంఘనే అవుతుందని ధ్వజమెత్తారు.
యూట్యూబర్ ‘ప్రశ్న రావణ్’పై మోపిన ‘ఉపా’ (UAPA) సహా అన్ని అక్రమ కేసులను బేషరతుగా, తక్షణమే ఉపసంహరించుకోవాలని, సోషల్ మీడియా వేదికగా ప్రజా సమస్యలపై స్పందించే వారిపై సాగుతున్న పోలీసు వేధింపులను అరికట్టాలని, భారత రాజ్యాంగం ఆర్టికల్ 19(1)(a) ద్వారా కల్పించిన భావ ప్రకటనా స్వేచ్ఛను, పౌర హక్కులను రక్షించాలని ప్రజాసంఘాల ఐక్య వేదిక డిమాండ్ చేసింది.
ఈ నిరసన కార్యక్రమంలో డా. బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా వ్యాప్తంగా ఉన్న పౌర సమాజ ప్రతినిధులు, దళిత, గిరిజన, వెనుకబడిన తరగతుల మరియు మైనారిటీ సంఘాల నాయకులు, విద్యార్థి, యువజన సంఘాల కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ‘ప్రశ్న రావణ్’కు న్యాయం జరిగే వరకు, రాజ్యాంగ హక్కుల పరిరక్షణ కోసం ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని ప్రజాసంఘాల ఐక్య వేదిక ప్రతినిధులు స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో మానవ హక్కుల వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వై.రాజేష్, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు కారెం వెంకటేశ్వరరావు, కొండా దుర్గారావు, రైతు కూలీసంఘం జిల్లా కార్యదర్శి, సిఐటియు జిల్లా అధ్యక్షులు జి దుర్గాప్రసాద్, సిఎల్సి నాయకులు జిల్లెల్ల మనోహర్, అమలదాసు బాబురావు, మానవ హక్కుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏ రవి, జిల్లా కార్యదర్శి పవన్, దళిత్ సేన అధ్యక్షులు అంబేద్కర్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు పశ్చిమాల శివ తదితరులు పాల్గొన్నారు.









