ములుగు, 2026-08-02
ఆగస్టు 9న ఆదివాసుల దినోత్సవం సందర్భంగా పచ్చజెండా ఎగరవేస్తూ, ఆగస్టు 24న ఏటూర్ నాగారం ఐటీడీఏను 20 వేల మందితో ముట్టడించాలని ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ పిలుపునిచ్చింది. జీవో 3 పునరుద్ధరణ, 1/70, పేసా చట్టాల అమలు డిమాండ్ చేస్తూ ఈ ఆందోళన చేపట్టారు.
ఎగర వేదం ఆదివాసి గుడాల్లో పచ్చజెండా ఎగరవేయాలని, ఆగస్టు 24న ఐటీడీఏ ముట్టడించాలని ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ పిలుపునిచ్చింది. ములుగు జిల్లా మంగపేట మండలంలో ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ అత్యవసర సమావేశం మంగపేట గ్రామపంచాయతీ ఆవరణలో మండల అధ్యక్షులు పూనెం ప్రశాంత్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ములుగు జిల్లా అధ్యక్షులు నల్లెబోయిన లక్ష్మణ్ దొర హాజరయ్యారు.
ఆగస్టు 9న ప్రపంచ ఆదివాసుల దినోత్సవం సందర్భంగా వీధి, వాడ, గూడెం ఆదివాసి పచ్చ జెండాను ఎగరవేయాలని జిల్లా వ్యాప్తంగా పిలుపునిచ్చారు. అదేవిధంగా ఆగస్టు 24న ఏటూర్ నాగారం ఐటీడీఏను 20 వేల మంది ఆదివాసులతో శాంతియుత ర్యాలీతో ముట్టడించేందుకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తుడుం దెబ్బ పిలుపునిచ్చింది. జీవో నెంబర్ 3ని పునరుద్ధరించాలని, 1/70, పేసా చట్టాలను పూర్తిస్థాయిలో పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు.
మనకు జరుగుతున్న అన్యాయంపై, మన హక్కుల పరిరక్షణకై, మన అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసం, మన హక్కుల సాధనకై ఉద్యమిద్దామని ఉద్యమ సైరన్ మోగించారు. ఏజెన్సీ ప్రాంతాలలో చట్టాల ఉల్లంఘన జరుగుతున్న చోట వాటిని పూర్తిగా అమలు చేయాలని కోరారు. ఈ ఐటీడీఏ ముట్టడి కార్యక్రమాన్ని రాష్ట్ర అధ్యక్షులు మైపతి అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఆగస్టు 24న జరగనున్న ఐటీడీఏ ముట్టడి శాంతియుత ర్యాలీ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఆదివాసి యువత, సీనియర్ నాయకులు, పెద్దలు, రైతులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని జిల్లా అధ్యక్షులు నల్లెబోయిన లక్ష్మణ్ దొర కోరారు. ఈ కార్యక్రమంలో ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ జిల్లా ప్రచార కార్యదర్శి సోయం ఈశ్వరయ్య, జిల్లా కార్యదర్శి కుర్సం రమేష్, మంగపేట మండల ఆదివాసీ నాయకులు చీమల శ్రీను, మారబోయిన గోవర్ధన్, ఎట్టి సారయ్య, ఈసాల భాగ్యరాజ్ తదితరులు పాల్గొన్నారు.










