*👉 (సహస్ర) ఆగస్టు 01
చర్ల మండలం వీరాపురం గ్రామంలో గోదావరి ఉప్పొంగుతున్న సమయంలో ఇసుక ర్యాంపు లారీలు వరదల్లో ఇరుక్కుపోయాయి. దీంతో 40 మంది లారీ డ్రైవర్లు, 20 మంది ప్రజలు వరదల్లో చిక్కుకుని తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. తక్షణమే జిల్లా అధికారులు స్పందించి ఇసుక ర్యాంపులపై చర్యలు తీసుకోవాలని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీ భద్రాచలం డివిజన్ కార్యదర్శి కామ్రేడ్ ముసలి సతీష్ అన్నారు.
చర్ల మండలం వీరాపురం గ్రామంలో గోదావరి ఉప్పొంగుతున్న సమయంలో ఇసుక ర్యాంపు లారీలు వరదల్లో ఇరుక్కుపోయాయి. దీంతో 40 మంది లారీ డ్రైవర్లు, 20 మంది ప్రజలు వరదల్లో చిక్కుకుని తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. తక్షణమే జిల్లా అధికారులు స్పందించి ఇసుక ర్యాంపులపై చర్యలు తీసుకోవాలని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీ భద్రాచలం డివిజన్ కార్యదర్శి కామ్రేడ్ ముసలి సతీష్ అన్నారు.
గత వారం రోజులుగా కురుస్తున్న ఎడతెరిపి వర్షాలతో గోదావరి ఉప్పొంగుతున్నా, వ్యాపార వర్గాలు, పాలకులు ప్రజల, కార్మికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ఆయన ఆరోపించారు. ప్రభుత్వాలు వరద హెచ్చరికలు జారీ చేసినా, వ్యాపార వర్గాలకు నష్టం రాకుండా అధికారుల అండదండలతో, పాలకవర్గాల తొత్తులుగా వ్యవహరిస్తున్న ఇసుక ర్యాంపు నిర్వాహకులు, ప్రజలను వరదల్లో ఇసుక తీయడానికి, లారీలను పంపడంతో అనేకమంది ప్రాణాపాయ స్థితిలోకి నెట్టబడ్డారని తెలిపారు. అయినప్పటికీ, ప్రాణాలతో బయటపడిన వారిని ఆపకుండా మళ్లీ ఇసుక ర్యాంపులను ప్రారంభించడం అన్యాయమని, ఇది ఎవరి ప్రయోజనం కోసం జరుగుతోందని ముసలి సతీష్ ప్రశ్నించారు.
ఒకవైపు పిఓ గారు అటవీ భూములను సర్వే చేసి, పోలీసులను పంపించి ఆదివాసీ ప్రజలపై 2023-24 సంవత్సరంలో అక్రమ కేసులు బనాయిస్తుంటే, మరోవైపు వరదల్లో ఇసుక ర్యాంపులలో డ్రైవర్లు, ప్రజలు ప్రాణాలతో ఇరుక్కుపోతున్నా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నా టీఎస్ఎండిసి, జిల్లా కలెక్టర్, ఇతర అధికారులు పట్టించుకోవడం లేదని ఆయన మండిపడ్డారు. అసలు ఈ జిల్లాలో అధికారుల పరిపాలన కొనసాగుతుందా లేదా, వారు ప్రజల పక్షాన ఉన్నారా లేక వ్యాపార వర్గాల పక్షాన ఉన్నారా అనేది అర్థం కావడం లేదని అన్నారు.
ప్రధానంగా భద్రాచలం డివిజన్లో అధికారుల ఊసే లేదని, నియమ నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని, జిల్లాలో కలెక్టర్, పిఓ ఉన్నారా లేదా అనేదే అర్థం కావడం లేదని ముసలి సతీష్ అన్నారు. ప్రమాదం జరగకముందే జాగ్రత్తలు తీసుకోవాలి కానీ, ప్రమాదం జరిగిన తర్వాత జాగ్రత్తలు తీసుకుంటారా అని ఆయన ప్రశ్నించారు.
తక్షణమే ఇసుక ర్యాంపులను నిలిపివేయాలని, ఆదివాసీలపై పెట్టిన అక్రమ కేసులను, నిర్బంధాలను ఆపాలని ఆయన డిమాండ్ చేశారు. లేనియెడల సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పిఓడబ్ల్యు మహిళా సంఘం భద్రాచలం డివిజన్ అధ్యక్షురాలు కోట నాగమణి, పాయం రాజమ్మ, కొండా స్వామి, పాయం కమల, లక్ష్మి, ఆదినారాయణ, రమేష్ రాజు తదితరులు పాల్గొన్నారు.











