నారాయణపేట, 14 July
మిషన్ భగీరథ కార్మికుల సమస్యల పరిష్కారం, కనీస వేతనాల జీవో అమలు, పెండింగ్ లో ఉన్న ప్రావిడెంట్ ఫండ్, ఇన్సూరెన్స్ చెల్లింపులు, సకాలంలో జీతాల చెల్లింపు వంటి డిమాండ్లపై TUCI, ప్రగతిశీల మిషన భగీరథ కాంట్రాక్టు & అవుట్ సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ నాయకులు ఆందోళన బాట పట్టారు. 15 రోజుల్లో డిమాండ్లు నెరవేర్చకపోతే ఈ నెల 29 నుంచి సమ్మెకు దిగుతామని హెచ్చరించారు.
మిషన్ భగీరథ (సత్య సాయి సెగ్మెంట్) కార్మికుల సమస్యలను పరిష్కరించాలని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన కనీస వేతనాల జీవో 6ను అమలు చేయాలని, పెండింగ్ లో ఉన్న 24 నెలల ప్రావిడెంట్ ఫండ్, ఇన్సూరెన్స్ చెల్లింపులు, సకాలంలో బ్యాంకు ద్వారా జీతాల చెల్లింపు వంటి డిమాండ్లను 15 రోజుల్లో పరిష్కరించాలని కోరుతూ TUCI మరియు ప్రగతిశీల మిషన భగీరథ కాంట్రాక్టు & అవుట్ సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ (Reg No :- A 1/2025, అనుబంధం TUCI) నాయకులు జిల్లా కలెక్టర్ నారాయణపేట గారికి వినతి పత్రం సమర్పించారు.
ఈ డిమాండ్లు పరిష్కారం కాని పక్షంలో, ఈ నెల 29 నుంచి సమ్మెలోకి వెళ్తామని యూనియన్ నాయకులు తెలిపారు. దీనికి సంబంధించి మిషన్ భగీరథ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మహబూబ్ నగర్ గారికి సమ్మె నోటీసు ఇవ్వడం జరిగింది. ఈ నోటీసు ప్రతులను జిల్లా కలెక్టర్ నారాయణపేట, మిషన్ భగీరథ సూపరింటెండ్ ఆఫ్ ఇంజనీర్ మహబూబ్నగర్, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ మహబూబ్నగర్ లకు కూడా అందజేశారు.
వినతిపత్రం అందించిన వారిలో TUCI జిల్లా అధ్యక్షులు ఎస్ కిరణ్, ఆంజనేయులు, మహేష్, సత్యనారాయణ, రాజప్ప, మునీర్, టోపీ శ్రీను తదితరులు ఉన్నారు.










