భద్రాద్రి కొత్తగూడెం, జూన్ 30
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సారపాకలో జరిగిన ద్విచక్ర వాహన ప్రమాదంలో కొడుకును కోల్పోయి, ఆరోగ్య పరిస్థితి విషమించిన చెలికాని ప్రవీణ్‌కు చిన్ననాటి స్నేహితులు అండగా నిలిచారు. ఆదివారం ఆయన ఇంటికి చేరుకున్న స్నేహితులు, కుటుంబానికి రూ. 55 వేల నగదు, మూడు నెలలకు సరిపడా నిత్యావసర సరుకులను అందజేశారు. మరో బృందం రూ. 10,000 సహాయం చేసింది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపాడు మండలం, సారపాకలో జూన్ 9న జరిగిన ద్విచక్ర వాహన ప్రమాదంలో చెలికాని ప్రవీణ్ తన కుమారుడిని కోల్పోయి, తీవ్ర అనారోగ్యం నుంచి కోలుకుంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో, 1999-2000 విద్యా సంవత్సరంలో భద్రాచలం కొర్రాజుల గుట్ట స్కూల్లో 10వ తరగతి చదివిన చిన్ననాటి స్నేహితులైన అమ్మాయిలు, అబ్బాయిలు ఆదివారం ప్రవీణ్ ఇంటికి వెళ్లి పరామర్శించారు. వారి కుటుంబానికి ఆర్థిక సహాయంగా రూ. 55 వేలు, మూడు నెలలకు సరిపడా సుమారు రూ. 15 వేల విలువైన నిత్యావసర సరుకులు అందజేశారు. ఇదేవిధంగా, 1997-1998 విద్యా సంవత్సరంలో సారపాక గవర్నమెంట్ స్కూల్లో 7వ తరగతి చదివిన స్నేహితులు కూడా ప్రవీణ్‌కు రూ. 10,000 ఆర్థిక సహాయం అందించారు.
ఈ సందర్భంగా స్నేహితులు మాట్లాడుతూ, ద్విచక్ర వాహన ప్రమాదంలో ప్రవీణ్ కుమారుడిని కోల్పోవడం, తను కూడా ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లడం దురదృష్టకరమని అన్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో తామున్నామంటూ ప్రవీణ్‌కు అండగా నిలిచామని తెలిపారు. కష్టసుఖాల్లో తోడుండేవాడే నిజమైన స్నేహితుడని, ప్రవీణ్ కుటుంబానికి తమ మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని, అతను త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో స్నేహితులు సత్రాల రమేష్, గున్నేపల్లి రాజు, తిరుక్కోవళ్ళూరి శేషగిరి, వేముల దుర్గారావు, ఆచంటి పురుషోత్తం, గుమ్మడి మురళి, రౌతు కోటేశ్వరరావు, పతకమూడి లక్ష్మణ్, సిద్ధి రాజుతో పాటు మరికొంత మంది స్నేహితులు పాల్గొన్నారు.











