Charla, July 3
చర్ల మండలం ఉప్పరిగూడెం గ్రామ వాస్తవ్యులు శ్రీమతి సోయం రమ (44) ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. పేదరికంతో ఉన్న ఆమె కుటుంబ సభ్యులు 'మీకోసం మేమున్నాం టీం' ను ఆశ్రయించడంతో, 13,000/- రూపాయలు సేకరించి, ఈరోజు ఆమె కుటుంబానికి అందజేశారు.
చర్ల మండలం ఉప్పరిగూడెం గ్రామ వాస్తవ్యులు, శ్రీ సోయం వెంకటేశ్వరరావు సతీమణి, శ్రీమతి సోయం రమ (44) కు ఇటీవల దుమ్ముగూడెం/సీతానగరం గ్రామం వద్ద జరిగిన ఓ మోటారు సైకిల్ ప్రమాదంలో తలకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రాణాంతకం కావడంతో ఆమెను ఖమ్మంలోని ప్రసూన న్యూరో ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేర్పించారు. పేదరికంతో ఉన్న వీరి కుటుంబ సభ్యులు, చికిత్సకు అయ్యే ఖర్చు భరించలేని పరిస్థితుల్లో 'మీకోసం మేమున్నాం టీం' ను ఆశ్రయించారు. దీంతో, ఫండ్ రైజింగ్ పోస్టు ద్వారా 13,000/- రూపాయలను సేకరించారు.
ఈ రోజుల్లో కూడా డబ్బులు లేక ప్రాణాలు కోల్పోయే పరిస్థితి రావడం కడు సోచనీయం. ఈ 13,000/- సొమ్మును ఈరోజు, అనగా జూలై 3వ తేదీన, ఉదయం 11 గంటలకు చర్లలోని 'మేమున్నాం' కార్యాలయంలో సంస్థ సభ్యులు చింతలపాటి అశోక్ గౌడ్ చేతుల మీదుగా వారి కుటుంబ సభ్యులకు అందించడం జరిగింది.
ప్రమాదం జరిగిన వెంటనే అందరినీ అప్రమత్తం చేసిన ఉప్పరిగూడెం సర్పంచ్ సోయం నాగలక్ష్మికి కృతజ్ఞతలు తెలుపుతూ, చైర్మన్ లయన్ నీలి ప్రకాష్ పలు విషయాలపై అవగాహన కల్పించారు. అనుకోని విపత్తు సమయంలో వచ్చే కష్టాలకు, దిగువ మధ్యతరగతి మరియు బడుగు బలహీన వర్గాల కుటుంబాలు అత్యంత బాధాకర పరిస్థితుల్లో ఉంటాయని, అటువంటి సమయాల్లో మనం అందించే చిన్న మొత్తం కూడా ఎంతో భరోసాను ఇస్తుందని, ప్రతీ ఒక్కరూ కూడా ఈ విషయాన్ని గమనించి ఒకరికొకరు సహాయమందించుకోవాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో దొడ్డి తాతారావు, జవ్వాది సతీష్, గొట్టిపాటి శ్రీనివాసరావు, బూహ్యవరపు ప్రతాప్, కవ్వాల రాము, దొడ్డి సూరిబాబు, రామ్మోహన్, సొల్లంగి నాగేశ్వరరావు, ఇర్ప పెద్ద బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.











