** (సహస్ర) జూలై 03
అమలాపురం నుంచి హైదరాబాద్ వెళ్లే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో ప్రయాణికుల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. బీఎస్ఆర్ ట్రావెల్స్ బస్సులో సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించి, వారి ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. నిబంధనలు పాటించని ట్రావెల్స్‌పై చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.
ప్రైవేట్ ట్రావెల్స్‌లో ప్రయాణించే వారి భద్రత ప్రశ్నార్థకంగా మారుతోందని, బస్సు ఎక్కిన తర్వాత యాజమాన్యం చెప్పిందే తుది అన్న పరిస్థితి నెలకొంటోందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అమలాపురం నుంచి హైదరాబాద్‌కు వెళ్లే బీఎస్ఆర్ ట్రావెల్స్ బస్సులో ఇటీవల సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించి, రిజర్వేషన్ చేసుకున్న వారిని ఇబ్బందులకు గురి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సీట్లు లేకపోవడంతో కొందరిని నడిచే మార్గం (ప్యాసేజ్)లోనే కూర్చోబెట్టారని, దీంతో సీట్లలో కూర్చున్న వారు కూడా దిగేందుకు ఇబ్బందులు పడ్డారని ప్రయాణికులు తెలిపారు.
అంతేకాకుండా, అతివేగంగా బస్సును నడుపుతూ ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ఆరోపిస్తున్నారు. ఏదైనా ప్రమాదం జరిగిన తర్వాతే అధికారులు స్పందించడం కాకుండా, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు.
ప్రైవేట్ ట్రావెల్స్ నిబంధనలు ఉల్లంఘించి పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించడం, భద్రతను నిర్లక్ష్యం చేయడంపై సంబంధిత రవాణా శాఖ అధికారులు వెంటనే దృష్టి సారించి, తనిఖీలు నిర్వహించి, నిబంధనలు ఉల్లంఘిస్తున్న ట్రావెల్స్ యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.










