నారాయణమూర్తిగడ్డ పోడు భూముల్లో బోటిగూడెం గ్రామస్తులు ట్రాక్టర్లతో దుక్కి దున్నడాన్ని గోండ్వానా సంక్షేమ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు పాయం సత్యనారాయణ ఖండించారు. ఈ చర్యలు సరైనవి కావని, సంబంధిత అధికారులు తక్షణమే జోక్యం చేసుకుని చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం చర్ల మండల తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు.
పెదముసిలేరు పరిధిలోని కంపార్ట్మెంట్-65లో గత 6-7 సంవత్సరాలుగా సున్నంగుంపు గ్రామానికి చెందిన 55 మంది ఆదివాసీలు ఉమ్మడిగా సాగు చేసుకుంటున్న పోడు భూముల్లోకి, ఆ భూములకు ఎటువంటి సంబంధం లేని బోటిగూడెం గ్రామస్తులు కావాలనే రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతూ, గత రెండు మూడు రోజులుగా ట్రాక్టర్లతో దుక్కి దున్నుతున్నారని సత్యనారాయణ ఆరోపించారు. ఈ చర్యలు శాంతిభద్రతలకు విఘాతం కలిగించే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.
నారాయణమూర్తిగడ్డ పోడు భూముల కోసం గతంలో గోండ్వానా సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో సున్నంగుంపు ఆదివాసీలు 169 రోజులపాటు రిలే నిరాహార దీక్షలు నిర్వహించి పోరాటం చేశారని సత్యనారాయణ గుర్తు చేశారు. అలాంటి పోరాటాల ద్వారా దక్కించుకున్న భూముల్లోకి మళ్లీ ఇతర గ్రామస్తులు జోక్యం చేసుకోవడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటని ఆయన ప్రశ్నించారు.
బోటిగూడెం గ్రామస్తులకు వారి స్వంత భూములు ఉన్నప్పటికీ, దురుద్దేశంతోనే పోడు భూముల్లోకి వస్తున్నారని సత్యనారాయణ ఆరోపించారు. ఫారెస్ట్, రెవెన్యూ, పోలీసు శాఖలు సమన్వయంతో వ్యవహరించి బాధ్యులపై చర్యలు తీసుకుంటే అక్కడ శాంతియుతంగా వ్యవసాయం కొనసాగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.











