ఇందిరమ్మ ఇండ్ల పథకం లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలు జరుగుతున్నాయని, స్థానిక ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేయాలని బిఎస్పి నాయకులు తడికల శివకుమార్ కోరారు.
లక్ష్మికాలనీ పంచాయితీ రెండవ వార్డ్ సభ్యులు, బిఎస్పి సీనియర్ నాయకులు తడికల శివకుమార్, ఇందిరమ్మ ఇండ్ల పథకం లబ్ధిదారుల ఎంపికలో సర్పంచులు, వార్డు సభ్యులను భాగస్వాములను చేయాలని కోరారు. లబ్ధిదారుల ఎంపికలో అధికార పార్టీ నాయకుల ప్రభావంతో అధికారులు తప్పుల తడకగా జాబితాలు తయారు చేస్తున్నారని, అర్హులైన చాలా మందిని జాబితా నుండి తొలగిస్తున్నారని ఆయన ఆరోపించారు.
పథకం పారదర్శకంగా అమలు కావాలంటే, స్థానిక పరిస్థితులపై అవగాహన ఉన్న పంచాయతీ పాలక వర్గాలను ఎంపిక ప్రక్రియలో చేర్చడం అవసరమని శివకుమార్ అన్నారు. అప్పుడే నిజమైన లబ్ధిదారులను గుర్తించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.
గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం మాదిరిగానే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వ్యవహరిస్తోందని, కాంగ్రెస్ నాయకులు జోక్యం చేసుకుని అనర్హులను ఎంపిక చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రభుత్వం ఈ విషయంలో పారదర్శకంగా వ్యవహరించాలని ఆయన డిమాండ్ చేశారు.
రెండవ విడత ఇందిరమ్మ ఇండ్ల పథకం లబ్ధిదారుల ఎంపికలో తేడాలు కొనసాగితే, బిఎస్పి ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.









