భద్రాద్రి కొత్తగూడెం, 2026-07-30
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఆగష్టు 10వ తేదీన దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాలని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ కమిటీ సభ్యులు మచ్చ వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. ఈ ఆందోళనలతో పోలీసు స్టేషన్లు, జైళ్ళు నిండాలని ఆయన అన్నారు.
కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక విధానాలపై సమరశంఖం పూరించాలని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ కమిటీ సభ్యులు మచ్చ వెంకటేశ్వర్లు ప్రజలకు పిలుపునిచ్చారు. ఆగష్టు 10వ తేదీన దేశ వ్యాప్తంగా ఆందోళన కారులతో పోలీసు స్టేషన్లు, జైళ్ళు నిండాలని ఆయన అన్నారు.
గురువారం నాడు బి.ఎస్ రామయ్య భవన్ లో సీఐటీయూ, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల మండల సదస్సు పాయం రాదా కుమారి అధ్యక్షతన జరిగింది. ఈ సదస్సులో అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ కమిటీ సభ్యులు మచ్చ వెంకటేశ్వర్లు, సీఐటీయూ జిల్లా అధ్యక్షులు కె.బ్రహ్మచారి, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు యలమంచి వంశీకృష్ణ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రేపాకుల శ్రీనివాస్, సిఐటీయు జిల్లా కోశాధికారి జి.పద్మ లు పాల్గొని ప్రసంగించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను కార్పోరేట్లకు కట్టబెడుతోందని విమర్శించారు. ప్రజల ఓట్లతో గెలిచి ప్రజా సంపదను దోచుకుంటున్న మోడీ ప్రభుత్వం కార్పోరేట్ సంస్థల ప్రయోజనం కోసం 29 కార్మిక చట్టాలను మార్చిందని, దీనివల్ల ఎనిమిది గంటల పని హక్కు, ఉద్యోగ భద్రత, కనీస వేతన చట్టం, సంఘం పెట్టుకునే హక్కులను హరిస్తుందని విమర్శించారు.
అదేవిధంగా రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరల చట్టం చేయాలని రైతులు కోరుతున్నా కేంద్ర ప్రభుత్వం గిట్టుబాటు ధర చట్టం చేయడం లేదని విమర్శించారు. దేశంలో ఉన్న రైతాంగానికి నష్టం కలిగించే విధంగా అమెరికాతో వాణిజ్య ఒప్పందాలు చేసుకుంటున్నారని తెలిపారు. పత్తి, మొక్కజొన్న, పాడి ఉత్పత్తులను, కోడి కాళ్ళను దిగుమతి చేసుకోవడానికి జరిగిన ఒప్పందాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి గ్రామీణ పేదలకు తీవ్ర అన్యాయం చేసిందని, కొత్తగా తీసుకు వచ్చిన వీబీజీరామ్ జి చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. నూతన విత్తన చట్టం, నూతన విద్యుత్ చట్టాలను తెచ్చి ప్రజలపై భారాలు మోపుతోందని అన్నారు.
బిజెపి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ఆగష్టు 10వ తేదీన క్విట్ ఇండియా స్పూర్తితో జైల్ భరో కార్యక్రమం జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం మండల నాయకులు మచ్చ రామారావు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి బందెల చంటి, ఐద్వా మండల కార్యదర్శి పొడుపుగంటి సమ్మక్క, ఆదివాసీ గిరిజన సంఘం మండల కార్యదర్శి వరదల వరలక్ష్మీ, శ్యామల చంద్రం, సీఐటీయూ జిల్లా నాయకురాలు విజయశీల, మండల కన్వీనర్ పాయం రాదా కుమారి, ఆశా వర్కర్స్ యూనియన్ మండల కార్యదర్శి సుజాత, మధ్యాహ్న భోజన కార్మిక సంఘం మండల కార్యదర్శి శ్యామల సమ్మక్క, తదితరులు పాల్గొన్నారు.












