ములుగు, 2026-09-02
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ డా వైఎస్ రాజశేఖర్ రెడ్డి 14వ వర్ధంతి సందర్భంగా ములుగు జిల్లా కేంద్రంలో ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీమతి దనసరి అనసూయ సీతక్క పాల్గొని, వైఎస్సార్ పాలనను సంక్షేమ స్వర్ణయుగంగా అభివర్ణించారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ డా వైఎస్ రాజశేఖర్ రెడ్డి 14వ వర్ధంతి సందర్భంగా ములుగు జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి దనసరి అనసూయ సీతక్క పాల్గొని, వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డా వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలన తెలుగు రాష్ట్రాల చరిత్రలో సంక్షేమ స్వర్ణయుగంగా నిలిచిపోయిందని అన్నారు. 2004 నుండి 2009 వరకు వారు సాగించిన సంక్షేమ పాలన, పేదరిక నిర్మూలనే ధ్యేయంగా ప్రవేశపెట్టిన విప్లవాత్మక పథకాలు కోట్ల మంది జీవితాలను మార్చాయని తెలిపారు.
ఆరోగ్యశ్రీ, రైతుల కోసం ఉచిత విద్యుత్, రుణమాఫీ, ఫీజు రీయింబర్స్ మెంట్, 108, 104 వంటి అత్యవసర సేవలు, ఇందిరమ్మ ఇళ్లు, మహిళలకు పావలా వడ్డీ రుణాలు, 2 రూపాయలకే బియ్యం, వృద్ధాప్య పింఛన్లు వంటి అనేక సంక్షేమ పథకాలను అమలు చేసి చిరస్థాయిలో నిలిచిపోయారని గుర్తు చేసుకున్నారు.
వారు భౌతికంగా దూరమైనప్పటికీ, వారు ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్ మెంట్, ఉచిత విద్యుత్ వంటి పథకాలు నేటికీ తెలుగు ప్రజల గుండెల్లో ఉన్నాయని మంత్రి సీతక్క వారి సేవలను స్మరించుకుంటూ నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పైడాకుల అశోక్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మల్లాడి రాంరెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ భానోత్ రవిచందర్, పంచాయతీ రాజ్ స్టేట్ డైరెక్టర్ బైరెడ్డి భగవాన్ రెడ్డి, రాష్ట్ర నాయకులు, జిల్లా సీనియర్ నాయకులు, ప్రజా ప్రతినిధులు, చైర్మన్లు, డైరెక్టర్లు, అనుబంధ సంఘాల నాయకులు, యూత్ నాయకులు, మహిళా నాయకులు తదితరులు పాల్గొన్నారు.








