ములుగు, 2026-07-31
ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, గోదావరి వరద ఉధృతితో పలు గ్రామాలు జలమయమయ్యాయి. ముఖ్యంగా, పాలెం ప్రాజెక్టు వాగు ఉప్పొంగడంతో పాటు గోదావరి వరద పెరగడంతో వరి పొలాలు నీట మునిగిపోయాయి. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, పాలెం ప్రాజెక్టు వాగు ఉధృతంగా ప్రవహించడం, గోదావరి వరద పెరగడంతో పలు గ్రామాలు జలమయమయ్యాయి. టేకుల బోరు, తుర్సవానిగూడెం, వెంగళరావుపేటతో పాటు పలు గ్రామాల్లోకి వరద నీరు చేరింది. చిన్న తరహా రైతులు సాగు చేసుకుంటున్న వరి పొలాలు పాలెం ప్రాజెక్టు, గోదావరి వరద నీటితో పూర్తిగా మునిగిపోయాయి.
ఎల్ నినో ప్రభావం నేపథ్యంలో తేలికపాటి పంటలు వేసుకోవాలని అధికారులు సూచించిన మేరకు రైతులు పెసర్లు, మినుములు వంటి పంటలు సాగు చేసుకున్నారు. అయితే, ఈ పొలాలు గోదావరి ముంపు ప్రాంతాల్లో ఉండటంతో పంటలు నీట మునగడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎడతెరిపి వర్షాలు, గోదావరి ఉధృతితో పంటలు మునిగిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు.
గోదావరి వరద నీరు గ్రామాల్లోకి రావడంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. ఎగువన ఉన్న పాలెం ప్రాజెక్టు, దిగువనున్న గోదావరి వరద నీటి మధ్య కొట్టుమిట్టాడుతున్న గిరిజన గ్రామాలకు సంబంధిత అధికారులు తక్షణమే పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. పంటలు పూర్తిగా నీట మునిగిపోవడంతో ప్రభుత్వం నష్టపరిహారం అందించాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.












