ములుగు, 2026-06-05
ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో ఎరువుల కొరత, బ్లాక్ మార్కెటింగ్ పై రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైతు కేంద్రాల వద్ద గంటల తరబడి వేచి చూస్తున్నా, యూరియా, డీఏపీలు అందుబాటులో ఉండటం లేదని, లింకుల పేరుతో అధిక ధరలు వసూలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.
ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలో ఎరువుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. యూరియా కొరత లేదని ప్రభుత్వాలు చెబుతున్నప్పటికీ, ఆన్లైన్ బుకింగ్ ద్వారా కొనుగోలు చేసిన రైతులు రైతు కేంద్రాల వద్ద గంటల తరబడి నిరీక్షిస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతంలో చిన్నతరహా రైతులు ఎక్కువగా ఉండటంతో, ఒక యూరియా బస్తా కొంటే తప్పనిసరిగా ఒక నానో యూరియా నానోడిఏపి తీసుకోవాలనే నిబంధన పెట్టి, చిన్న రైతుల నుంచి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారని రైతు కేంద్రాల యజమాన్యాలపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
లింకుల పేరుతో దోపిడీ
పెద్ద రైతులకు ట్రాక్టర్లలో యూరియా, డీఏపీలను తరలిస్తూ, చిన్న రైతులకు మాత్రం నిల్వలు లేవని, లింకుల ద్వారానే తీసుకోవాలని చెబుతూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని రైతులు వాపోతున్నారు. ఈ విషయంపై సంబంధిత అధికారులు స్పష్టత ఇవ్వాలని వారు కోరుతున్నారు.
ఛత్తీస్‌గఢ్‌కు తరలింపు
అంతేకాకుండా, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతాలైన వాజేడు, వెంకటాపురం నుంచి ఫెర్టిలైజర్ యజమాన్యాలు అధిక ధరలకు యూరియా, డీఏపీలను అమ్ముకుంటూ పక్క రాష్ట్రమైన ఛత్తీస్‌గఢ్‌కు తరలిస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. సంబంధిత అధికారులు బొలెరో, మ్యాజిక్ వాహనాలను తనిఖీ చేసి, ఎరువుల అక్రమ రవాణాపై స్పష్టత తీసుకురావాలని రైతులు కోరుతున్నారు.
రైతుల ఆవేదన
రైతే రాజు అని చెప్పుకునే ప్రభుత్వాలు ఉన్నప్పటికీ, రైతులు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూ, వడ్డీలపై వడ్డీలు కట్టుకుంటూ తీవ్రంగా సతమతమవుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి విరుద్ధంగా, ఫెర్టిలైజర్ షాపు యజమాన్యాలు స్కోడా కార్లలో తిరుగుతూ, రైతుల శ్రమదానాన్ని దోచుకుంటున్నారని ఆరోపణలున్నాయి. చాలామంది గిరిజన రైతుల నుంచి అక్రమంగా వడ్డీలు వసూలు చేస్తూ, అధిక ధరలకు విత్తనాలు, ఎరువులను విక్రయిస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ధరల పట్టికల ప్రదర్శనపై నిర్లక్ష్యం
వెంకటాపురం మండల కేంద్రంలో ఫెర్టిలైజర్ షాపులు వందల్లో పెరిగినప్పటికీ, ఇప్పటివరకు ధరల పట్టికలను ప్రదర్శించకపోవడం దారుణమని రైతులు పేర్కొంటున్నారు. అధికారులు ఈ విషయంపై ఎందుకు దృష్టి సారించడం లేదని, ధరల పట్టికలను తప్పనిసరిగా ప్రదర్శించేలా చర్యలు తీసుకోవాలని, లేని యెడల తమ ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.












