ఆదివాసీ హక్కుల పరిరక్షణ వేదిక తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ ఇరప. రాజుదొర, లంబాడీలు నిర్వహించనున్న బస్సు యాత్రను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, రాజ్యాంగబద్ధంగా ఆదివాసులకు కల్పించిన హక్కులను పరిరక్షించకపోతే యాత్రను అడ్డుకుంటామని హెచ్చరించారు.
భారత రాజ్యాంగం ఆదివాసులకు విద్య, ఉపాధి, రాజకీయ హక్కులు మరియు రిజర్వేషన్ల కోసం ప్రత్యేక హామీలు కల్పించిందని, అయితే అవి పూర్తిస్థాయిలో అమలు కావడం లేదని రాజుదొర పేర్కొన్నారు. "లంబాడీలకు ఎస్టీ రిజర్వేషన్ కల్పించి 50 సంవత్సరాలు పూర్తయ్యాయి" అనే పేరుతో ఈ నెల 25వ తేదీ నుంచి ప్రారంభం కానున్న బస్సు యాత్ర, ఆదివాసుల చరిత్రను, హక్కులను వక్రీకరించే ప్రయత్నమని ఆయన ఆరోపించారు.
ఆదివాసులు ఈ దేశపు మూలవాసులని, షెడ్యూల్డ్ ఏరియాల్లోని విద్య, ఉద్యోగాలు, రాజకీయ అవకాశాలు స్థానిక ఆదివాసులకే చెందాలని రాజ్యాంగం స్పష్టంగా పేర్కొంటుందని ఆయన గుర్తు చేశారు. అయితే, కొందరు రాజకీయ నాయకుల ప్రోత్సాహంతో లంబాడీలు షెడ్యూల్డ్ ప్రాంతాల్లోకి ప్రవేశించి, అక్రమంగా ఏజెన్సీ ధృవపత్రాలు పొందుతూ అవకాశాలను దక్కించుకుంటున్నారని ఆరోపించారు. తామే అసలైన ఆదివాసులమని ప్రచారం చేయడం సరైంది కాదని, దీనిని ఆదివాసి సమాజం సహించబోదని స్పష్టం చేశారు.
స్వాతంత్ర్యం వచ్చి 79 ఏళ్లు గడిచినా, పాలక వర్గాలు ఆదివాసుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వకుండా, ఓటు బ్యాంకు రాజకీయాల కోసం వారి హక్కులను బలహీనపరిచే విధానాలు అవలంబిస్తున్నాయని విమర్శించారు. ఆదివాసులకు చెందాల్సిన రిజర్వేషన్ ప్రయోజనాలు ఇతరులకు మళ్లిపోతున్నాయని, దీనిపై ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. లంబాడీల బస్సు యాత్రను ఆదివాసి సంఘాలు, ప్రజాసంఘాలు, మేధావులు, ప్రజల సహకారంతో అడ్డుకుంటామని, ఆదివాసుల రాజ్యాంగ హక్కుల పరిరక్షణ కోసం పోరాటం కొనసాగిస్తామని తెలిపారు.












