వైరా, 30 June
ఖమ్మం జిల్లా వైరా మండలంలోని స్టేజి పినపాక గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై వైరా బ్రిడ్జి ఇరువైపులా వైరా మున్సిపాలిటీ చెత్తను పారవేయడంతో ప్రయాణికులు, గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చెత్తకుప్పల దుర్గంధం, దహనం వల్ల వచ్చే పొగతో ప్రయాణం దుర్భరంగా మారింది.
ఖమ్మం జిల్లా వైరా మండల పరిధిలోని స్టేజి పినపాక గ్రామ సమీపంలోని జాతీయ రహదారిపై ఉన్న వైరా బ్రిడ్జి ఇరువైపులా వైరా మున్సిపాలిటీ చెత్తను ప్రతిరోజూ పారవేస్తుండటంతో ప్రయాణికులు, గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
చెత్తకుప్పల నుంచి వెదజల్లుతున్న దుర్గంధంతో ముక్కు మూసుకోకుండా రహదారిపై ప్రయాణించడం కష్టంగా మారిందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాయంత్రం వేళల్లో చెత్తకు నిప్పు పెట్టడం వల్ల రహదారి మొత్తం పొగతో నిండిపోతుండటంతో వాహనదారులకు దారి సరిగా కనిపించక ప్రమాదాల బారిన పడే పరిస్థితి ఏర్పడుతోందని తెలిపారు.
పొగను పీల్చడం వల్ల శ్వాసకోశ సంబంధిత సమస్యలు తలెత్తుతున్నాయని, చిన్నపిల్లలు, విద్యార్థులు, వృద్ధుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతోందని గ్రామస్థులు పేర్కొన్నారు. తరచూ చెత్త దహనం చేయడం వల్ల బ్రిడ్జి దిగువ భాగంలోని స్లాబ్ పెచ్చులు ఊడిపోతున్నాయని, భవిష్యత్తులో పెను ప్రమాదం సంభవించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
వైరా రిజర్వాయర్ నుంచి వచ్చే నీరు ఈ బ్రిడ్జి మార్గంలో అనేక ఎకరాల సాగుభూములకు చేరుతుందని రైతులు తెలిపారు. గతంలో ఈ నీటిని తాగునీటిగా కూడా ఉపయోగించేవారని, ప్రస్తుతం చెత్త, వ్యర్థాల కారణంగా నీరు కలుషితమై తాగడానికి పనికిరాకుండా పోయిందని, పంటలపై కూడా ప్రతికూల ప్రభావం పడుతుందని వాపోయారు.
అదేవిధంగా బ్రిడ్జికి సమీపంలో ఉన్న పవిత్ర స్నాన లక్ష్మీపురం శివాలయానికి వెళ్లే మార్గం ఇదే కావడంతో, కలుషితమైన నీటితో భక్తులు పవిత్ర స్నానం చేసే పరిస్థితి లేకుండా పోయిందని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
స్టేజి పినపాక గ్రామానికి చెందిన తన్నీరు రవికిశోర్ మాట్లాడుతూ, ఈ సమస్యను పలుమార్లు అధికారులకు, ప్రజాప్రతినిధులకు, ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లినా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు. ప్రతిరోజూ ఈ మార్గంలో విద్యార్థులు పెద్ద సంఖ్యలో ప్రయాణిస్తుంటారని, చెత్త దహనం వల్ల వచ్చే పొగ వారి ఆరోగ్యానికి హానికరమని పేర్కొన్నారు.
ఇప్పటికైనా సంబంధిత అధికారులు వెంటనే స్పందించి చెత్త పారవేత, దహనాన్ని నిలిపివేసి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని గ్రామస్థులు, రైతులు, భక్తులు, ప్రయాణికులు కోరుతున్నారు.










