ములుగు, 2026-07-21
ములుగు జిల్లా వాజేడు మండలం, కృష్ణాపురం గ్రామపంచాయతీ పరిధిలోని దుబ్బగూడెం గ్రామంలో జరిగిన వ్యక్తి హత్య కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. మద్యానికి బానిసై కుటుంబ సభ్యులను నిత్యం వేధిస్తున్న చలపతి అనే యువకుడిని అతని తండ్రి, ఇద్దరు అక్కలు కలిసి గొడ్డలితో నరికి దారుణంగా హత్య చేసినట్లు విచారణలో వెల్లడైంది. ఈ కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ములుగు జిల్లా వాజేడు మండలం, కృష్ణాపురం గ్రామపంచాయతీ పరిధిలోని దుబ్బగూడెం గ్రామంలో జరిగిన హత్య కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. పేరూరు ఎస్ఐ సంఘటనా స్థలానికి వెళ్లి విచారించగా, దుబ్బగూడెం గ్రామానికి చెందిన మడే చలపతి (తండ్రి పేరు మదనయ్య, వయసు 30 సంవత్సరాలు) తన ఇంటి ముందు వంట చేసుకునే రేకుల షెడ్డులో మంచంపై పడుకుని ఉన్నప్పుడు, గుర్తుతెలియని వ్యక్తులు అతని ముఖంపై, మెడ మరియు తలపై పదునైన ఆయుధంతో నరికి హత్య చేసినట్లుగా ప్రాథమికంగా నిర్ధారించారు.
ఈ ఘటనపై పేరూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసుకుని, మృతదేహానికి పంచనామా నిర్వహించి, పోస్టుమార్టం చేయించారు. నేర విచారణలో భాగంగా, పోలీసులకు అందిన నమ్మదగిన సమాచారం ప్రకారం, ఈ హత్య వెనుక మృతుని కుటుంబ సభ్యులే ఉన్నట్లు తెలిసింది. దీంతో, మృతుని కుటుంబ సభ్యులను వారి ఇంటి వద్ద విచారించగా, మృతుని తండ్రి, పెద్దక్క, మూడవ అక్క కలిసి హత్య చేసినట్లు నేరాన్ని అంగీకరించారు.
మద్యానికి బానిసై, ఎలాంటి పనులు చేయకుండా కుటుంబ బాధ్యతలను నిర్లక్ష్యం చేస్తూ, ప్రతిరోజు మద్యం తాగి వచ్చి తల్లిదండ్రులను, పెళ్లి చేసుకోకుండా ఇంట్లో ఉన్న పెద్దక్కను, అలాగే వారి ఇంటి ముందున్న మూడవ అక్కను తిడుతూ, కొట్టేవాడని మృతుని కుటుంబ సభ్యులు తెలిపారు. నాలుగు రోజుల క్రితం మృతుడు తన తల్లిదండ్రులను, పెద్దక్కను కొట్టడంతో, తల్లి, పెద్దక్క వారి ఇంటి ముందున్న మూడవ అక్క ఇంటికి వెళ్లారు. మృతుని తండ్రి కృష్ణాపురం గ్రామంలో ఉంటున్న తన రెండవ కూతురి ఇంటికి వెళ్లి రాత్రికి తిరిగి వచ్చి ఇంటి దగ్గర పడుకునేవాడు.
జూలై 16, 2026న, మృతుడు తన మూడవ అక్కను ఉదయం పూట బట్టలు తీసుకోవడానికి ఇంటికి రమ్మని పిలిచి, ఆమెను తిట్టి, కర్రతో కొట్టడంతో ఆమె భయపడి వెళ్లిపోయింది. అదేరోజు మధ్యాహ్నం, మృతుడు తన తండ్రిని బెదిరించి, కొట్టి, అతని వద్ద నుంచి 500 రూపాయలు తీసుకుని మద్యం సేవించాడు. రాత్రిపూట ఇంటికి వచ్చి, ప్రతిరోజులాగే ఇంటి ముందున్న రేకుల షెడ్డు కింద అన్నం వండుకునే దగ్గర మంచంలో నిద్రిస్తున్నప్పుడు, రాత్రి సుమారు 10:30 గంటల సమయంలో, మృతుని బాధల నుండి తప్పించుకోవడానికి అతన్ని చంపడం తప్ప వేరే మార్గం లేదని అతని పెద్దక్క, మూడవ అక్క నిర్ణయించుకున్నారు. ఈ విషయం తన తండ్రితో చెప్పగా, అతను కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.
ముగ్గురూ కలిసి మృతుని ఇంట్లో ఉన్న గొడ్డలిని తీసుకొని, తల, ముఖంపై, మెడ భాగంపై ఒకరి తర్వాత ఒకరు కోపంతో పలుమార్లు నరికి హత్య చేసినట్లు నేరాన్ని అంగీకరించారు. నేరానికి ఉపయోగించిన గొడ్డలిని పంచుల సమక్షంలో స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని, వారిని జ్యుడీషియల్ రిమాండ్కు తరలించారు. కుటుంబ సభ్యులను వేధించడమే ఈ హత్యకు ప్రధాన కారణమని పోలీసులు తెలిపారు.












