భద్రాద్రి కొత్తగూడెం, 21.07.2026
నీట్ పరీక్ష పేపర్ లీకేజీ ఘటన, ఆందోళనకు దిగిన విద్యార్థులపై లాఠీఛార్జిని నిరసిస్తూ సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో దుమ్ముగూడెం మండల కేంద్రంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
నీట్ పరీక్ష పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి, యువకులు పార్లమెంటు ఎదుట శాంతియుతంగా ఆందోళనకు బయలుదేరితే, వారిపై విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేయడాన్ని నిరసిస్తూ దుమ్ముగూడెం మండల కేంద్రంలో సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా జరిగిన నిరసన కార్యక్రమంలో సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ భద్రాచలం డివిజన్ కార్యదర్శి కామ్రేడ్ ముసలి సతీష్ మాట్లాడుతూ, సంవత్సరాల తరబడి కోచింగ్ తీసుకొని నీట్ పరీక్షకు సిద్ధమై, పరీక్ష రాస్తే ఆ పరీక్ష పేపర్ ను లీక్ చేసి విద్యార్థుల భవిష్యత్తును పాడు చేశారని అన్నారు.
దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని విద్యార్థి, యువకులు రోడ్డెక్కి నినాదిస్తున్నా, విద్యాశాఖ మంత్రితో రాజీనామా చేయించకపోవడం వెనుక అత్యవసరం ఏమిటని ఆయన ప్రశ్నించారు.
ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన లాఠీఛార్జిని ఖండిస్తూ, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేంతవరకు విద్యార్థి యువకులు పోరాడాలని ముసలి సతీష్ పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో పీ వై ఎల్ నాయకులు మట్ట నరసింహరావు, కుంజ జోగారావు, మడకం సమ్మక్క, తెల్లం సీత, కోట నాగమణి, పాయం రాజమ్మ తదితరులు పాల్గొన్నారు.












