భద్రాద్రి కొత్తగూడెం, 27 June
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం, బక్క చింతలపాడు గ్రామానికి చెందిన మడకం ఈడమయ్యా అనే వృద్ధుడు విద్యుత్ షాక్తో రెండు కాళ్లను కోల్పోయి, గత ఆరేళ్లుగా వికలాంగుల పెన్షన్ అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు. భార్య కూలి పనులకు వెళ్తూ కుటుంబాన్ని పోషిస్తోంది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం, పులిగుండాలం పంచాయతీ పరిధిలోని బక్క చింతలపాడు గ్రామానికి చెందిన మడకం ఈడమయ్యా అనే వృద్ధుడు విద్యుత్ షాక్కు గురై రెండు కాళ్లను ప్రమాదవశాత్తు కోల్పోయాడు. అప్పటినుంచి అతను మంచానికే పరిమితమై జీవనం సాగిస్తున్నాడు. ఈ ఒక్క ప్రమాదం ఆ నిరుపేద కుటుంబంలో చీకట్లు కమ్మేసింది.
గత ఆరేళ్లుగా ప్రభుత్వం నుంచి అందాల్సిన వికలాంగుల పెన్షన్ కూడా ఈడమయ్యకు అందడం లేదు. భర్త నడవలేక, కదలలేక మంచంపైనే కాలం వెళ్లదీస్తుండటంతో అతని భార్య తీవ్ర ఆవేదనకు గురవుతోంది. ఒకపక్క భర్తకు సపర్యలు చేయడం, మరోపక్క ఇంటిని గడవడం గగనంగా మారిన తరుణంలో, ఆమె కూలి పనులకు వెళ్తోంది. ఎండనక, వాననక ఆమె చేస్తున్న పనుల ద్వారా వచ్చే అరకొర ఆదాయంతోనే ఆ కుటుంబం నెట్టుకొస్తోంది.
భర్తకు కనీస వైద్యం చేయించలేక, పూట గడవడమే కష్టంగా మారిన ఆ కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతోంది. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నామని పాలకులు చెబుతున్నా.. కళ్లముందే ఇంతటి దయనీయ స్థితిలో ఉన్న ఈడమయ్యకు పెన్షన్ రాకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, స్థానిక ప్రజాప్రతినిధులు మానవతా దృక్పథంతో స్పందించి, మంచానికే పరిమితమైన మడకం ఈడమయ్యకు తక్షణమే వికలాంగుల పెన్షన్ మంజూరు చేసి, ఆ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని బక్క చింతలపాడు గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.












