Charla, గురువారం
చర్లలో వనవాసి కళ్యాణ పరిషత్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలోనే తొలి శబరి బాలిక విద్యాలయం గురువారం ఉదయం 7:57 గంటలకు వనవాసి కళ్యాణ ఆశ్రమం ప్రాంగణంలో ఘనంగా ప్రారంభమైంది. ఈ విద్యాలయం బాలికలకు విద్యతో పాటు భారతీయ సంస్కృతి, దేశభక్తి, నైతిక విలువలు, మంచి సంస్కారాలను అందించడమే లక్ష్యంగా పనిచేస్తుంది.
చర్లలో వనవాసి కళ్యాణ పరిషత్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలోనే తొలి శబరి బాలిక విద్యాలయం గురువారం ఉదయం 7:57 గంటలకు వనవాసి కళ్యాణ ఆశ్రమం ప్రాంగణంలో ఘనంగా ప్రారంభమైంది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వనవాసి కళ్యాణ పరిషత్ అఖిల భారత ప్రశిక్ష సభ్యులు కొర్వింజ రామచంద్రయ్య హాజరై విద్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ, శబరి బాలిక విద్యాలయం ప్రారంభం కావడం ఎంతో సంతోషకరమైన విషయమని అన్నారు. విద్యాలయ నిర్వహణను క్రమశిక్షణతో కొనసాగిస్తూ, బాలికలకు విద్యతో పాటు భారతీయ సంస్కృతి, దేశభక్తి, నైతిక విలువలు, మంచి సంస్కారాలను అందించాలని సూచించారు.
పిల్లలందరూ సహజంగానే మంచివారేనని, వారికి అందించే బోధన, పెంపకం, సంస్కారాల ద్వారానే వారు సమాజానికి ఉపయోగపడే వ్యక్తులుగా ఎదుగుతారని ఆయన పేర్కొన్నారు.
ఈ సందర్భంగా శబరి బాలిక విద్యాలయం కోసం జవ్వాది కోదండ రాంబాబు, సుమతి దంపతులు 10 సెంట్ల విలువైన భూమిని విరాళంగా అందజేసినట్లు నిర్వాహకులు తెలిపారు. విద్యాలయానికి శాశ్వత భవనం నిర్మాణం కోసం దాతలు ఉదారంగా ముందుకు వచ్చి ఆర్థిక సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. నూతన భవనం నిర్మాణం పూర్తయిన అనంతరం విద్యార్థినులకు అవసరమైన అన్ని వసతులను ఒకేచోట కల్పించేలా చర్యలు చేపడతామని వెల్లడించారు.
కార్యక్రమంలో సేవాభారతి, విశ్వహిందూ పరిషత్ ప్రతినిధులు, హిందూ బంధువులు, వనవాసి కళ్యాణ పరిషత్ కార్యకర్తలు, స్థానిక ప్రముఖులు అధిక సంఖ్యలో పాల్గొని విద్యాలయ ప్రారంభోత్సవాన్ని విజయవంతం చేశారు.











