భద్రాద్రి కొత్తగూడెం, 2026-07-18
సీతారామ ప్రాజెక్టు నీళ్లను ఖమ్మం జిల్లాకు తరలించే ప్రణాళికలను అడ్డుకోవాలని, ఆ నీళ్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రైతులకే దక్కాలని బీఆర్ఎస్ పార్టీ కన్వీనర్ దొడ్డి తాతారావు డిమాండ్ చేశారు. ప్రాజెక్టును సందర్శించడానికి వస్తున్న మంత్రులపై నిరసన తెలిపేందుకు వెళ్తున్న బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అడ్డుకోవడం, అరెస్టు చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.
సీతారామ ప్రాజెక్టు నీళ్లు కేవలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రైతులకే ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ కన్వీనర్ దొడ్డి తాతారావు డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లా మంత్రులు సీతారామ ప్రాజెక్టు నీళ్లను ఖమ్మం జిల్లాకు తరలించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. దీనిని అడ్డుకోవడానికి బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు ఆధ్వర్యంలో అశ్వాపురం వస్తున్న నలుగురు మంత్రుల సీతారామ ప్రాజెక్టు సందర్శన సందర్భంగా రైతుల తరపున నిరసన తెలియజేయడానికి మనుగూరు బయలుదేరిన బీఆర్ఎస్ నాయకులను, కార్యకర్తలను పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి అడ్డుకోవడం తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు.
శాంతియుతంగా నిరసన తెలిపే హక్కును కాలరాస్తూ, ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రశ్నిస్తున్న ప్రజల గొంతును పోలీసుల ద్వారా అణచివేయాలని చూస్తోందని దొడ్డి తాతారావు విమర్శించారు. ప్రజలకు నష్టం కలిగించే ఏ కార్యక్రమం చేపట్టినా ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికైనా సీతారామ ప్రాజెక్టు నీళ్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రైతులకు మాత్రమే ఉపయోగించాలని డిమాండ్ చేశారు.












