ములుగు, 2026-08-07
రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఈ నెల 16న ములుగు జిల్లాలో పర్యటించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టనున్న పంచాయతీ రాజ్ హమ్ రోడ్ల పనులకు ముఖ్యమంత్రి ఇక్కడి నుండే శ్రీకారం చుట్టనున్నారు. ఈ నేపథ్యంలో, మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఈ నెల 16న ములుగు జిల్లాలో పర్యటించనున్నారని, రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టనున్న పంచాయతీ రాజ్ హమ్ రోడ్ల పనుల కార్యక్రమానికి ముఖ్యమంత్రి ఇక్కడి నుండే శ్రీకారం చుట్టనున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క తెలిపారు. జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేసి పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆమె ఆదేశించారు.
అధికారులతో సమీక్ష
ముఖ్యమంత్రి రానున్న సందర్భంగా మంత్రి సీతక్క శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ బోర్కేడే హేమంత్ సహదేవురావు, జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్, జిల్లా అటవీ శాఖ అధికారి వికాస్ మీనా లతో కలిసి అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ప్రారంభోత్సవాల వివరాలు
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ ముఖ్యమంత్రి హైదరాబాదు నుండి నేరుగా మేడారం చేరుకొని వన దేవతలను దర్శించుకొని, అనంతరం ములుగు చేరుకొని పైలాన్ ప్రారంభించడమే కాకుండా ములుగు మండలం ఇంచర్ల గ్రామ శివారులో ఏడు కోట్ల రూపాయలతో నిర్మించిన ఇందిరమ్మ మహిళా శక్తి భవనాన్ని వర్చువల్ గా, నూతన కలెక్టరేట్ సముదాయ భవనాన్ని ప్రారంభిస్తారని వెల్లడించారు. జిల్లాలో ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్న అభివృద్ధి పనుల వివరాల జాబితాను అన్ని శాఖల అధికారులు ఈ నెల 10వ తేదీ వరకు సిద్ధం చేయాలని సూచించారు.
పర్యటన షెడ్యూల్
ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ ఈ నెల 12న వెల్లడించడం జరుగుతుందని తెలిపారు. సీఎం పర్యటన సందర్భంగా ఎలాంటి లోటుపాట్లు లేకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో విజయవంతం చేయాలని అన్నారు.
మేడారం పరిసరాలపై సూచనలు
మేడారం పరిసర ప్రాంతాల్లో రహదారులు ఆక్రమించి వ్యాపారాలు చేస్తున్న వారికి జరిమానా విధించాలని, వ్యాపారాలు ఏర్పాటు చేయకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను సూచించారు.
పాల్గొన్నవారు
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు మహేందర్ జి, సంపత్ రావు, జిల్లా గ్రంధాలయ చైర్మన్ బానోత్ రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి, జిల్లా ఆత్మ కమిటీ చైర్మన్ రఘు, రాష్ట్ర పంచాయతీరాజ్ డైరెక్టర్ భగవాన్ రెడ్డి, ఆర్డీఓ కృష్ణవేణి, డిఆర్ఓ రవికుమార్, ఎస్ డి సి ప్రతాప్, డిప్యూటీ ట్రేని కలెక్టర్ కుషిల్ వంశీ, అన్ని శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.








