వెంకటాపురం, 17 November
ములుగు జిల్లా వెంకటాపురం వెంకటాపురం మండలంలోని వెంగళరావుపేట గ్రామంలో వీధిలైట్ల నిర్వహణ సరిగా లేకపోవడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాత్రివేళల్లో వీధులు చీకటిమయంగా మారుతున్నాయని, ఇది భద్రతకు ముప్పు కలిగిస్తోందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని ఉప్పేడు వీరాపురం గ్రామపంచాయతీ పరిధిలోని వెంగళరావుపేట గ్రామంలో వీధిలైట్ల నిర్వహణపై గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీధిలైట్లు సక్రమంగా వెలగకపోవడంతో రాత్రివేళల్లో గ్రామంలోని వీధులు చీకటిమయంగా మారుతున్నాయని వారు పేర్కొన్నారు.
గ్రామంలో ఏర్పాటు చేసిన వీధిలైట్లను కొన్ని రోజులు పూర్తిగా నిలిపివేస్తున్నారని, మరికొన్ని సందర్భాల్లో ఇష్టానుసారంగా ఆన్ చేస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా, అర్ధరాత్రి సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు వీధిలైట్ల విద్యుత్ లైన్లను కట్ చేసి చోరీలకు పాల్పడుతున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని తెలిపారు.
ఈ సమస్యపై పలుమార్లు గ్రామపంచాయతీ కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి సమస్యను పట్టించుకోకపోవడంతో వీధిలైట్ల నిర్వహణ అస్తవ్యస్తంగా మారిందని ఆరోపించారు.
వీధిలైట్లు ఏర్పాటు చేసినప్పటికీ వాటిని ఎందుకు నిలిపివేస్తున్నారు విద్యుత్ లైన్లను ఎవరు కట్ చేస్తున్నారు రాత్రి వేళల్లో గ్రామంలో చోటుచేసుకుంటున్న పరిణామాలపై పంచాయతీ అధికారులు ఎందుకు స్పందించడం లేదని గ్రామస్తులు ప్రశ్నించారు. వెంగళరావుపేటలో వీధిలైట్ల సమస్యను సంబంధిత అధికారులు వెంటనే పరిశీలించి, రాత్రివేళల్లో వీధిలైట్లు నిరంతరం వెలిగేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరారు. అలాగే విద్యుత్ లైన్లను ధ్వంసం చేస్తున్నట్లు వస్తున్న ఆరోపణలపై విచారణ జరిపి, బాధ్యులను గుర్తించాలని విజ్ఞప్తి చేశారు.







