వెంకటాపురం, 17 November
ఏజెన్సీ ప్రాంతమైన మేజర్ గ్రామ పంచాయతీకి రెగ్యులర్ కార్యదర్శి లేకపోవడంతో స్థానిక ప్రజలు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని గోండ్వానా సంక్షేమ పరిషత్ ములుగు జిల్లా అధ్యక్షులు పూనెం ప్రతాప్ అన్నారు. వలస గిరిజనేతరుల అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇస్తూ ఏజెన్సీ చట్టాలను నిర్వీర్యం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
మేజర్ గ్రామ పంచాయతీకి రెగ్యులర్ కార్యదర్శిని నియమించాలని గోండ్వానా సంక్షేమ పరిషత్ (జిఎస్పి) ములుగు జిల్లా అధ్యక్షులు పూనెం ప్రతాప్ డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో కొమరం భీం విగ్రహం ఆవరణంలో జిఎస్పి విద్యార్థి విభాగం నాయకులు పూనెం నితిన్ అధ్యక్షతన జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఏజెన్సీ ప్రాంతమైన మేజర్ గ్రామపంచాయతీకి రెగ్యులర్ కార్యదర్శి లేకపోవడంతో స్థానిక ప్రజలకు అనేక సమస్యలు తలెత్తుతున్నాయని పూనెం ప్రతాప్ అన్నారు. ప్రస్తుతం గ్రామ పంచాయతీ ఇంచార్జిగా వ్యవహరిస్తున్న కార్యదర్శి ఎల్టిఆర్, 1/70 చట్టానికి విరుద్ధంగా వలస గిరిజనేతరుల అక్రమ నిర్మాణాలకు ఇష్టానుసారంగా అనుమతులు ఇస్తూ, ఏజెన్సీ చట్టాలను నిర్వీర్యం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మేజర్ గ్రామపంచాయతీ నుండి బదిలీపై పంపిన కార్యదర్శిని మళ్ళీ అదే పంచాయతీకి ఇంచార్జిగా నియమించడం స్థానిక ప్రజలకు అనేక అనుమానాలకు తావిస్తుందని, దీనిని జిల్లా అధికారులు ఒకసారి పరిశీలించాలని తెలిపారు. దీని వెనుక ఉన్న అంతరార్థాన్ని జిల్లా పంచాయతీ అధికారులు తేల్చిచెప్పాలని డిమాండ్ చేశారు.
స్థానికంగా నివసిస్తున్న ఆదివాసులకు ఇంటి పన్నులు మంజూరు చేయకుండా అనేక ఇబ్బందులు పెడుతూ, ఆదివాసి కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్న పరిస్థితులు తలెత్తుతున్నాయని ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 1/70కి విరుద్ధంగా మైదాన ప్రాంతాల నుండి అక్రమ వలసలు వస్తున్నప్పటికీ వారిని నిరోధించకుండా, వారికి అండగా నిలబడుతూ వారి అక్రమ భవనాలకు ఇంటి పన్ను మంజూరు చేస్తూ, 1/70 ఎల్టీఆర్ చట్టాన్ని పాతర వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యలు మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలంటే, జిల్లా అధికారులు వెంటనే మేజర్ గ్రామపంచాయతీకి శాశ్వతంగా కార్యదర్శిని నియమించాలని పూనెం ప్రతాప్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కుంజా ప్రకాష్, పూనెం పార్థు, చంటి తదితరులు పాల్గొన్నారు.







