జూన్ 21న జరగనున్న ఆదివాసీ యువత సన్నాహక సమావేశాన్ని పురస్కరించుకొని, తుడుందెబ్బ నాయకులు చర్ల మండలంలో ప్రచార కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ నేపథ్యంలో, సమ్మక్క–సారలమ్మ దేవాలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి, కొబ్బరికాయ కొట్టి ప్రచారానికి శ్రీకారం చుట్టారు.
తుడుందెబ్బ రాష్ట్ర నాయకులు వాసం ముసలయ్య, కుర్సం రాంబాబు మాట్లాడుతూ, ఆదివాసీ యువత తమ హక్కులు, సమస్యలు, భవిష్యత్ అవకాశాలపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. సమాజ అభివృద్ధిలో యువత పాత్ర కీలకమని, రాబోయే సమావేశంలో అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో ఆదివాసీల ఆత్మగౌరవం, హక్కుల పరిరక్షణ, విద్య, ఉపాధి అవకాశాలు, భూ హక్కులు, ప్రభుత్వ పథకాల అమలు వంటి అంశాలపై చర్చించనున్నట్లు తెలిపారు. యువత సామాజిక చైతన్యంతో ముందుకు సాగి తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని సూచించారు.
ప్రచార కార్యక్రమంలో చర్ల మండల ఆదివాసీ యువ నాయకులు పూనెం వరప్రసాద్, శ్యామల, తరుణ్, పూనెం రవికిరణ్, కోరం బిక్షపతి, ఇర్ప అరుణ్ కుమార్, ఇర్ప అరుణ్, కోరం వేణు, మడప అనిల్ కుమార్ తో పాటు పలువురు పాల్గొన్నారు. గ్రామాల వారీగా విస్తృత ప్రచారం నిర్వహించి యువతను సమీకరించేందుకు నాయకులు సన్నద్ధమవుతున్నారు.












