మానుగూరు, 19 November
పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు రూ.57 లక్షల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు.
మున్సిపాలిటీ పరిధిలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల అభివృద్ధికి పెద్దపీట వేస్తూ, మొత్తం రూ.57 లక్షల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాలకు పినపాక ఎమ్మెల్యే, ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్మన్ పాయం వెంకటేశ్వర్లు శ్రీకారం చుట్టారు. మండలంలోని కమలాపురం గ్రామంలో రూ.42 లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే భూమిపూజ చేసి పనులు ప్రారంభించారు. అనంతరం మున్సిపల్ కార్యాలయం సమీపంలో రూ.15 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన ఆస్పిరేషనల్ టాయిలెట్స్‌ను ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రజల అవసరాలకు అనుగుణంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. గ్రామాల్లో రహదారుల నిర్మాణం పూర్తయితే ప్రజల రాకపోకలు సులభతరమవుతాయని, వర్షాకాలంలో ఎదురయ్యే ఇబ్బందులు తొలగుతాయని పేర్కొన్నారు. పినపాక నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యంగా, అవసరమైన నిధులు సమకూరుస్తూ రహదారులు, డ్రైనేజీలు, తాగునీరు తదితర మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నామని చెప్పారు. అదేవిధంగా, పట్టణ ప్రాంతాల్లో పారిశుధ్య నిర్వహణ, ప్రజారోగ్య పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలకు పరిశుభ్రమైన, సురక్షితమైన మరుగుదొడ్ల సౌకర్యాలు అందుబాటులో ఉండటం వల్ల పట్టణ పరిశుభ్రత మెరుగుపడుతుందని తెలిపారు. నూతనంగా ప్రారంభించిన ఆస్పిరేషనల్ టాయిలెట్స్‌ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ, నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్, ఎంపీడీవో, అధికారులు, జిల్లా జనరల్ సెక్రటరీ పోలమూరి రాజు, మండల అధ్యక్షులు పిరినాకి నవీన్, టౌన్ అధ్యక్షులు కురం రవి ముదిరాజ్, మైనారిటీ అధ్యక్షులు రహీం పాషా, ఆత్మా కమిటీ సభ్యులు, జిల్లా ముఖ్య నాయకులు, సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు, మహిళా నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, స్థానిక నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.







