ముమ్మిడివరం, జూలై 10
ముమ్మిడివరం ప్రభుత్వ ఆసుపత్రి వెనుక పిచ్చిమొక్కలు, డొంకలతో నిండి విషసర్పాలకు నివాసంగా మారిన ప్రాంగణాన్ని మున్సిపల్ కమిషనర్ రవివర్మ చొరవతో శుభ్రం చేయించిన ఘటనపై మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి చీకురుమెల్లి రవికుమార్ హర్షం వ్యక్తం చేశారు. అదే సమయంలో ప్రసూతి వార్డులోని అంతర్గత సమస్యలను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు.
డా. బి. ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం సామాజిక ఆరోగ్య కేంద్రం (ప్రభుత్వ ఆసుపత్రి) వెనుక భాగంలో గత నాలుగు నెలలుగా పిచ్చిమొక్కలు, దట్టమైన డొంకలు పెరిగిపోయి విషసర్పాలకు నివాసంగా మారినప్పటికీ హాస్పిటల్ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి చీకురుమెల్లి రవికుమార్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సమస్యను ఈ నెల 6న జరిగిన పి.జి.ఆర్.ఎస్ (స్పందన) కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రవివర్మ దృష్టికి తీసుకెళ్లగా, ఆయన తక్షణమే స్పందించి జేసీబీ ద్వారా ఆ ప్రాంగణాన్ని పూర్తిగా శుభ్రం చేయించి సమస్యను పరిష్కరించడం పట్ల ఆయన మీడియా ముఖంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
అదే సమయంలో ఆసుపత్రిలోని ప్రసూతి వార్డు టాయిలెట్లు, కారిడార్లలో టైల్స్ లేకపోవడం వల్ల పారిశుధ్యం దెబ్బతిని గర్భిణులు, బాలింతలు మరియు రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన తెలిపారు. ఈ అంతర్గత సమస్యలను కూడా ప్రభుత్వం మరియు ఆరోగ్య శాఖ అధికారులు యుద్ధప్రాతిపదికన స్పందించి ప్రత్యేక నిధులు కేటాయించి పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
లేనిపక్షంలో ఈ సమస్యలపై కూడా తానే స్వయంగా ఉన్నతాధికారులతో పోరాడి రోగులకు న్యాయం చేస్తానని ఆయన పత్రికా ప్రకటన ద్వారా స్పష్టం చేశారు.











