జర్నలిస్టుల పిల్లల విద్యాభ్యాసానికి ఆర్థిక చేయూతనిస్తూ, వారి ఫీజుల్లో 50 శాతం రాయితీ కల్పించే దిశగా జిల్లా విద్యాశాఖ అడుగులు వేసింది. ఈ మేరకు టీయూడబ్ల్యూజే (టీజెఎఫ్) హెచ్ - 143 యూనియన్ నాయకులు చేసిన వినతికి జిల్లా విద్యాశాఖ ఏడీ శంభూ ప్రసాద్ సానుకూలంగా స్పందించారు.
టీయూడబ్ల్యూజే (టీజెఎఫ్) హెచ్ - 143 యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కల్లోజి శ్రీనివాస్, ఎండి షఫీ నేతృత్వంలో పలువురు నాయకులు జిల్లా విద్యాశాఖ ఏడీ శంభూ ప్రసాద్‌ను కలిసి వినతిపత్రం అందించారు. జర్నలిస్టులు సమాచార ప్రసారంలో కీలక పాత్ర పోషిస్తూ, అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నారని, పెరుగుతున్న విద్యా ఖర్చులతో వారి కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాయని వారు వివరించారు.
ఎయిడెడ్, ప్రైవేట్ విద్యా సంస్థల్లో జర్నలిస్టుల పిల్లలకు 50 శాతం ఫీజు రాయితీ కల్పించాలని, తద్వారా వారి భవిష్యత్తుకు భరోసా కల్పించాలని యూనియన్ నాయకులు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం, విద్యాశాఖ ఈ అంశంపై సానుకూలతతో స్పందించి, జర్నలిస్టుల సంక్షేమానికి తోడ్పడాలని వారు కోరారు.
జర్నలిస్టుల వినతిని పరిగణనలోకి తీసుకున్న జిల్లా విద్యాశాఖ ఏడీ శంభూ ప్రసాద్, ఈ విషయంలో సానుకూల స్పందన తెలిపారు. జర్నలిస్టుల పిల్లల ఫీజు రాయితీకి సంబంధించి జిల్లాలోని విద్యాసంస్థలకు త్వరలోనే స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తామని హామీ ఇచ్చారు. ఈ హామీతో స్థానిక జర్నలిస్టులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు యూనియన్ నాయకులు, ప్రతినిధులు పాల్గొన్నారు.











