శ్రీరాముడిపై భక్తితో దానం చేసిన భూమి డంపింగ్ యార్డుగా మారిందని, దీనికి భద్రాచలం దేవాలయ అధికారుల నిర్లక్ష్యమే కారణమని కొత్తపల్లి గ్రామస్తులు, దాత ఆరోపిస్తున్నారు. సుమారు 84 సెంట్ల విలువైన భూమి ప్రస్తుతం చెత్తాచెదారంతో నిండిపోయిందని వారు తెలిపారు.
చర్ల మండలంలోని కొత్తపల్లి గ్రామంలో శ్రీరాముడిపై ఉన్న భక్తితో దాత గుమ్మడి సత్యనారాయణ, దేవాలయ నిర్మాణాలు, అభివృద్ధి కార్యక్రమాల కోసం సుమారు 84 సెంట్ల భూమిని దేవాదాయ శాఖకు అందజేశారు. అయితే, కాలక్రమేణా ఈ భూమిని అధికారులు నిర్లక్ష్యం చేయడంతో అది చెత్త, వ్యర్థ పదార్థాలతో నిండి డంపింగ్ యార్డుగా మారిందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
సర్వే నంబర్ 68/3లో ఉన్న ఈ భూమి ప్రస్తుతం లక్షల రూపాయల విలువ కలిగి ఉందని, భక్తితో దానం చేసిన ఈ స్థలాన్ని అధికారులు పరిరక్షించకపోవడం బాధాకరమని దాత గుమ్మడి సత్యనారాయణ పేర్కొన్నారు. “నా వద్దే ఉంటే శుభ్రంగా ఉంచుకునేవాడిని. దేవాలయ నిర్మాణం లేదా ప్రజా ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారని భావించి ఇచ్చిన భూమిని డంపింగ్ యార్డుగా మార్చడం బాధ కలిగిస్తోంది” అని ఆయన వాపోయారు.
గ్రామస్తులు సైతం ఈ విషయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దేవాలయాల అభివృద్ధి కోసం దానం చేసే వారిలో విశ్వాసం సన్నగిల్లేలా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని వారు అభిప్రాయపడుతున్నారు. దానం చేసిన భూములే నిర్లక్ష్యానికి గురైతే భవిష్యత్తులో ఎవరూ ముందుకు రావడానికి ఆసక్తి చూపరని వారు పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో, భద్రాచలం దేవాలయ అధికారులు స్పందించి భూమిని వెంటనే శుభ్రపరచి, చుట్టూ కంచె ఏర్పాటు చేసి సంరక్షణ చర్యలు చేపట్టాలని దాత, గ్రామస్తులు కోరుతున్నారు. లేనిపక్షంలో ఆ భూమిని తిరిగి తమకు అప్పగిస్తే పేదలకు పంచేందుకు సిద్ధంగా ఉన్నామని దాత తెలిపారు.






