ప్రముఖ తెలుగు సాహితీవేత్త, విద్యావేత్త డాక్టర్ ద్వాదశి నాగేశ్వర శాస్త్రి (ద్వా.నా. శాస్త్రి) జయంతిని పురస్కరించుకుని అమలాపురంలో సాహితీ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన సాహిత్య కృషిని కొనియాడుతూ ఘనంగా నివాళులర్పించారు.
కోనసీమ రచయితల సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో శ్రీ శ్రీ కళా వేదిక జిల్లా అధ్యక్షులు నల్లా నరసింహమూర్తి మాట్లాడుతూ, డాక్టర్ ద్వా.నా. శాస్త్రి తెలుగు సాహిత్యంలో చెరగని ముద్ర వేశారని అన్నారు. ఆయనను 'తెలుగు సాహితీ శిఖరం'గా అభివర్ణించారు.
నాలుగు దశాబ్దాలకు పైగా తెలుగు అధ్యాపకునిగా విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేసిన డాక్టర్ శాస్త్రి, పోటీ పరీక్షలకు శిక్షణ ఇచ్చి ఎందరికో ఉన్నత ఉద్యోగాలు సాధించేలా తోడ్పడ్డారని నరసింహమూర్తి తెలిపారు.
ఈ సందర్భంగా, డాక్టర్ ద్వా.నా. శాస్త్రి సాహిత్యంపై నల్లా నరసింహమూర్తి రచించిన 'నానీలు' పుస్తకాన్ని రచయిత్రి పోలిశెట్టి అనంతలక్ష్మి దేవి ఆవిష్కరించారు. అనంతరం కవి సమ్మేళనం జరిగింది.
డాక్టర్ ద్వా.నా. శాస్త్రి 'సమాధిలో స్వాగతాలు' నుండి 'శతాధిక కవులనానీలు' వరకు 40 గ్రంథాలు రచించారని, 'నన్నయ నుండి నేటి వరకు తెలుగు సాహిత్య చరిత్ర' వంటి గ్రంథాలు విద్యార్థులకు ఎంతో ఉపయోగపడ్డాయని నరసింహమూర్తి వివరించారు.










