భద్రాద్రి కొత్తగూడెం, 5 July
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని గుంపెనగూడెం ప్రభుత్వ పాఠశాలలో నెలకొన్న ఉపాధ్యాయుల నిర్లక్ష్యంపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానోపాధ్యాయుడు మద్యం మత్తులో పాఠశాలకు వస్తున్నారని, మరో ఉపాధ్యాయురాలు తరచూ సెలవులు పెడుతోందని ఆరోపిస్తున్నారు. దీంతో విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందిస్తున్నామని ప్రభుత్వం ప్రచారం చేస్తున్న వేళ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని గుంపెనగూడెం ప్రభుత్వ పాఠశాలలో నెలకొన్న పరిస్థితులు మాత్రం ఆ ప్రచారానికి పూర్తి విరుద్ధంగా ఉన్నాయని గ్రామస్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత విద్యా సంవత్సరం నుంచి కొనసాగుతున్న నిర్లక్ష్యం కారణంగా విద్యార్థుల చదువు పూర్తిగా దెబ్బతింటోందని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
గ్రామస్తుల ఆరోపణల ప్రకారం, పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులు ఉన్నప్పటికీ వారిలో ఎవరూ సక్రమంగా విధులకు హాజరుకావడం లేదని చెబుతున్నారు. ప్రధానోపాధ్యాయుడు తరచూ మద్యం మత్తులో పాఠశాలకు వస్తున్నారని, మరో ఉపాధ్యాయురాలు ఎప్పుడు విధులకు వస్తుందో, ఎప్పుడు సెలవు పెడుతుందో తెలియని పరిస్థితి నెలకొందని ఆరోపిస్తున్నారు. ఇన్ని సెలవులకు ఎవరు అనుమతులు ఇస్తున్నారని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు.
ఈ పరిస్థితుల వల్ల విద్యార్థుల చదువు పూర్తిగా దెబ్బతింటోందని, గతంలో 36 మంది విద్యార్థులు ఉన్న పాఠశాలలో ప్రస్తుతం విద్యార్థుల సంఖ్య క్రమంగా తగ్గుతోందని గ్రామస్తులు చెబుతున్నారు. దీంతో తమ పిల్లలను సమీపంలోని ఇతర పాఠశాలలకు పంపేందుకు ప్రయత్నిస్తే, టీసీలు (ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్లు) ఇవ్వడం లేదని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
దైర్యంగా ఇతర పాఠశాలకు పిల్లలను పంపాలన్నా ప్రధాన రహదారిపై నిరంతరం తిరిగే ఇసుక లారీలు, భారీ ట్రాఫిక్ కారణంగా చిన్నారుల భద్రతపై భయం వేస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. "ఇక్కడ చదువు లేదు... బయటకు పంపాలంటే ప్రమాదం" అనే దుస్థితి నెలకొందని వాపోతున్నారు.
ప్రభుత్వం "ప్రభుత్వ పాఠశాలల్లోనే పిల్లలను చేర్పించండి, మెరుగైన విద్య అందిస్తాం" అంటూ విస్తృత ప్రచారం చేస్తుండగా, ఈ గ్రామంలో కనీసం బడిబాట కార్యక్రమం కూడా నిర్వహించకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని తల్లిదండ్రులు విమర్శిస్తున్నారు.
"మేమూ ఇదే పాఠశాలలో చదువుకున్నాం. కానీ ఇంత దారుణ పరిస్థితి ఎప్పుడూ చూడలేదు. ఒకప్పుడు బాగా నడిచిన పాఠశాలను ఇప్పుడు మూతపడే స్థితికి తీసుకొచ్చారు" అంటూ గ్రామ పెద్దలు ఆవేదన వ్యక్తం చేశారు.
గత సంవత్సరం కూడా ఇదే సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని, ఈ ఏడాదైనా మార్పు వస్తుందని ఆశించామని, కానీ పాఠశాల ప్రారంభమై నెల రోజులు కావస్తున్నా పరిస్థితి ఏమాత్రం మారలేదని వారు తెలిపారు. ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా అధికారులు ఒక్కసారి కూడా పాఠశాలను సందర్శించి సమస్యలను పరిశీలించలేదని ఆరోపించారు.










