విశాఖపట్నంలోని పీఎంపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో వివాహమైన 40 రోజులకే నవ వధువు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన కలకలం రేపింది. ఆర్ హెచ్ కాలనీలో నివాసం ఉంటున్న యాండ్రాపు కృష్ణవేణి (25) ఇంట్లో ఫ్యాన్ కు ఉరి వేసుకుని కనిపించింది.
వివరాల్లోకి వెళితే, విజయనగరం జిల్లా మెంటాడ ప్రాంతానికి చెందిన కృష్ణవేణి, అదే ప్రాంతానికి చెందిన యాండ్రాపు మురళీని ఈ ఏడాది మే 13న వివాహం చేసుకున్నారు. కొద్ది రోజులకే వీరు విశాఖపట్నంలోని పీఎంపాలెం పరిధిలో అద్దె ఇంట్లోకి మారారు. మురళీ ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తుండగా, కృష్ణవేణి కూడా ఒక షాపులో పనిచేస్తున్నారు.
బుధవారం రాత్రి మురళీ తన పని ముగించుకుని ఇంటికి చేరుకున్నారు. అప్పటికే ఇంట్లో కృష్ణవేణి ఫ్యాన్ కు ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించింది. ఈ సంఘటనతో తీవ్ర దిగ్భ్రాంతికి గురైన మురళీ వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి, పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు సీఐ బాలకృష్ణ తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నామని, పూర్తి వివరాలు విచారణ అనంతరం వెల్లడిస్తామని ఆయన పేర్కొన్నారు.












