పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో ఆదివారం ఒక మహిళ దారుణ హత్యకు గురైంది. కారులో ప్రయాణిస్తుండగా, మార్గమధ్యలో ఎక్కిన వ్యక్తి కత్తితో దాడి చేసి ఆమెను హతమార్చినట్లు సమాచారం.
అంబేడ్కర్ కోనసీమ జిల్లా సఖినేటిపల్లికి చెందిన జాలేం దీన రోజా (31) నరసాపురంలో కారులో ప్రయాణిస్తుండగా ఈ ఘటన జరిగింది. ఆమె సూళ్లూరుపేటలో ANMగా అప్రెంటిస్‌షిప్ చేస్తోంది. ఉదయం రైలులో నరసాపురం చేరుకున్న తర్వాత, కారులో వెళ్తుండగా సఖినేటిపల్లికి చెందిన మార్గాని రమేశ్ బాబు అనే వ్యక్తి కారులోకి ఎక్కాడు.
కొద్దిసేపటి పరిచయం తర్వాత, రమేశ్ బాబు తన వద్ద ఉన్న కత్తితో రోజాపై విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ దాడిలో రోజా అక్కడికక్కడే మృతి చెందింది. సంఘటనలో కారు డ్రైవర్ కూడా గాయపడినట్లు తెలిసింది.
గాయపడిన డ్రైవర్‌తో పాటు మృతురాలిని నరసాపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతురాలికి ఇద్దరు పిల్లలు ఉన్నారని తెలిసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. హత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నట్లు తెలిపారు.
ఈ దారుణ హత్య స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకునేందుకు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.












