విజయవాడకు చెందిన రౌడీషీటర్ గాదె సాయికృష్ణ పోలీసుల కస్టడీలో అనుమానాస్పద రీతిలో మరణించారని, ఈ ఘటనపై సమగ్ర విచారణ జరపాలని కోరుతూ మాజీ ఎంపీ కేశినేని నాని జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) కు ఫిర్యాదు చేశారు. పోలీసులే హింసించి చంపారని, సాక్ష్యాధారాలు నాశనం చేసేందుకు అస్థికలను కృష్ణా నదిలో కలిపేశారని ఆయన ఆరోపించారు.
విజయవాడలో రౌడీషీటర్ గాదె సాయికృష్ణ అదృశ్యం కేసు ఇప్పుడు 'లాకప్ డెత్' ఆరోపణలతో తీవ్ర దుమారం రేపుతోంది. ఈ వ్యవహారంపై మాజీ ఎంపీ కేశినేని నాని అధికారికంగా జాతీయ మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేశారు. పోలీసుల థర్డ్ డిగ్రీ హింస వల్లే సాయికృష్ణ మరణించాడని ఆయన తన ఫిర్యాదులో సంచలన ఆరోపణలు చేశారు. మృతదేహంపై గాయాలు బయటపడతాయనే భయంతో, పోలీసులు రహస్యంగా దహన సంస్కారాలు పూర్తి చేశారని, భవిష్యత్తులో ఫోరెన్సిక్, డీఎన్ఏ ఆధారాలు లభించకుండా అస్థికలను కృష్ణా నదిలో కలిపేశారని ఆరోపించారు.
మాజీ ఎంపీ కేశినేని నాని మాట్లాడుతూ, విజయవాడలో 'ఫ్రెండ్లీ పోలీసింగ్' అనేది కేవలం కాగితాలకే పరిమితమైందని విమర్శించారు. శాంతిభద్రతలను పర్యవేక్షించాల్సిన పోలీసు వ్యవస్థ, నేడు మాఫియా శక్తులకు కొమ్ముకాస్తోందని, కొందరు అధికారులు ప్రైవేట్ సెటిల్మెంట్లు చేసే సిండికేట్గా మారిపోయారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఈ లాకప్ డెత్ వ్యవహారంలో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ కేశినేని నాని NHRC ముందు రెండు కీలక చట్టపరమైన డిమాండ్లను ఉంచారు. విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖర్ బాబును తక్షణమే విధుల్లోంచి సస్పెండ్ చేయాలని, సాయికృష్ణను చట్టవిరుద్ధంగా నిర్బంధించడం, పోలీసుల చేతిలో జరిగిన ఈ హత్య ఉదంతంపై సెక్షన్ 176(1ఏ) ప్రకారం తక్షణమే ఒక స్వతంత్ర జ్యుడీషియల్ విచారణకు ఆదేశించాలని కోరారు.
ఈ ఫిర్యాదుతో విజయవాడ పోలీస్ వర్గాల్లో ఒక్కసారిగా కలకలం రేగింది. జాతీయ మానవ హక్కుల కమిషన్ ఈ అంశంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది. ఈ ఘటనపై పోలీసు శాఖ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.










