భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ అధ్యక్షతన జరిగిన నెలవారీ నేర సమీక్షా సమావేశంలో, సీసీటీఎన్ఎస్ 2.0 అమలు, కేసుల సకాలంలో అప్లోడ్, వర్షాకాలంలో ప్రజల రక్షణ, రోడ్డు ప్రమాదాల నివారణ వంటి పలు కీలక అంశాలపై చర్చించారు.
జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ మాట్లాడుతూ, సీసీటీఎన్ఎస్ 2.0 పరిధిలో నమోదైన కేసుల దర్యాప్తు పురోగతిని నిర్దేశిత కాలపరిమితిలో ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని, ప్రతి అధికారి సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న కేసులను సకాలంలో పూర్తి చేసి బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
వర్షాకాలం ప్రారంభం దృష్ట్యా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తుగా తగిన రక్షణ చర్యలు చేపట్టాలని ఎస్పీ అధికారులను ఆదేశించారు. నూతన విద్యా సంవత్సరం నేపథ్యంలో స్కూల్ బస్సుల ఫిట్నెస్ను నిశితంగా పరిశీలించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరిగే బ్లాక్ స్పాట్లను గుర్తించి, ప్రమాదాల నివారణకై సంబంధిత అధికారులతో సమన్వయం పాటిస్తూ చర్యలు చేపట్టాలని తెలిపారు.
గంజాయి, మట్కా, జూదం వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీ సూచించారు. సీసీ కెమెరాల ప్రాముఖ్యత గురించి ప్రజలలో అవగాహన కల్పించి, తమ నివాస ప్రాంతాల్లో మరియు వ్యాపార సముదాయాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేలా చేయాలని తెలిపారు. సైబర్ నేరాల బారిన పడకుండా ప్రజలను అప్రమత్తం చేస్తూ అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని కోరారు.
మద్యం సేవించి వాహనాలు నడుపుతూ, ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ రోడ్డు ప్రమాదాలకు కారణమయ్యే వారిపై నిరంతరం వాహన తనిఖీలు చేపట్టి, చట్టపరంగా కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీ సూచించారు. ఈ సమీక్షా సమావేశంలో పలువురు డిఎస్పీలు, సిఐలు, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.








