డా. బి. ఆర్. అంభేద్కర్ కోనసీమ జిల్లా, ముమ్మిడివరంలో జరిగిన ఆక్వా రైతు దాట్ల కృష్ణంరాజు హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. డబ్బుల కోసమే ఈ హత్య జరిగినట్లు దర్యాప్తులో తేలింది. ఈ కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు డిఎస్పీ టి.ఎస్.ఆర్.కె. ప్రసాద్ తెలిపారు.
ఈ నెల 17న కొత్తమురమళ్ల గ్రామంలో ఆక్వా రైతు కృష్ణంరాజు (64)ను హత్య చేసి, మృతదేహాన్ని రాళ్లతో కట్టి చెరువులో పడేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. శనివారం ఐ. పోలవరం పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డిఎస్పీ వివరాలు వెల్లడించారు.
విశాఖ జిల్లాకు చెందిన సాలపురెడ్డి బాజ్జి, మరియు 17 ఏళ్ల మైనర్ బాలుడిని ఈ కేసులో అరెస్ట్ చేసినట్లు డిఎస్పీ తెలిపారు. వీరిద్దరూ చెరువు వద్ద పనిచేస్తున్నారని, యజమాని తరచుగా తిట్టడంతోనే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు విచారణలో వెల్లడైంది.
నిందితులు, యజమాని ఖాతాలోని డబ్బులను కాజేయాలనే దురుద్దేశ్యంతోనే హత్య చేసినట్లు ఒప్పుకున్నారు. యజమానిని రాడ్ తో కొట్టి చంపి, అతని మోటార్ సైకిల్, సెల్ ఫోన్ ను కూడా తీసుకుని పారిపోయినట్లు తెలిపారు. అప్పటికే రూ. 90 వేల నగదును వేరే ఖాతాకు బదిలీ చేసుకున్నట్లు సమాచారం.
కేసును ఛేదించడంలో చురుకుగా వ్యవహరించిన ముమ్మిడివరం సి.ఐ., ఎస్సైలను డిఎస్పీ అభినందించారు. పనికి పెట్టుకునే ముందు ఉద్యోగుల పూర్తి వివరాలు సేకరించాలని యజమానులకు సూచనలు జారీ చేశారు.











