మధ్యప్రదేశ్‌కు చెందిన ఒక అంతర్రాష్ట్ర దొంగల ముఠా ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశించినట్లు అందిన సమాచారంతో రాష్ట్ర పోలీసులు అప్రమత్తమయ్యారు. ప్రకాశం, ఏలూరు జిల్లాల పోలీసులు అప్రమత్తత చర్యలు చేపట్టారు.
ధార్ జిల్లాకు చెందిన ఈ ముఠా రాష్ట్రంలోకి ప్రవేశించి ఉండవచ్చని భావిస్తున్నారు. దీనితో పలు ప్రాంతాల్లో నిఘాను కట్టుదిట్టం చేశారు. చీరాలలో గతంలో చోరీ కేసుల్లో నిందితులుగా ఉన్న స్థానిక ముఠాలతో ఈ అంతర్రాష్ట్ర ముఠాకు సంబంధాలు ఉండవచ్చన్న అనుమానంతో, పోలీసులు స్థానిక నేరస్థుల కదలికలపై కూడా ప్రత్యేక నిఘా పెట్టారు.
చీరాల టూ టౌన్ సీఐ శశికుమార్ అనుమానితుల ఫోటోలతో కూడిన పోస్టర్లను విడుదల చేశారు. ఈ పోస్టర్లలో ఉన్న వ్యక్తులు చోరీలు, దోపిడీ కేసుల్లో నిందితులని, వారి ఆచూకీ తెలిసిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.
పర్చూరు ప్రాంతంలో కూడా పోలీసులు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. పర్చూరు ఎస్ఐ పులి గోపి మాట్లాడుతూ, ధార్ గ్యాంగ్ కదలికలపై రాష్ట్రవ్యాప్తంగా అప్రమత్తత కొనసాగుతోందని తెలిపారు. ఏలూరు రైల్వే స్టేషన్ పరిసరాల్లో ముగ్గురు అనుమానితుల కదలికలు సీసీ కెమెరాల్లో నమోదైనట్లు చెప్పారు.
గ్రామాలు, పట్టణాల్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తులు కనిపిస్తే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించారు. ప్రజల సహకారంతో ఈ ముఠా కదలికలను గుర్తించి, నేరాలను అరికట్టేందుకు చర్యలు కొనసాగుతున్నాయని పోలీసులు వెల్లడించారు.










