దుగినేపల్లి, చేగర్షల గ్రామాలకు చెందిన రెండు గిరిజన సొసైటీల మధ్య నెలకొన్న వివాదాన్ని అధికారులు, ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకొని శాంతియుతంగా పరిష్కరించాలని సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ (ప్రజాపందా) మణుగూరు డివిజన్ కార్యదర్శి ఆర్. మధుసూదన్ రెడ్డి డిమాండ్ చేశారు.
చేగర్షల గ్రామ గిరిజన సొసైటీ సభ్యులు న్యాయం చేయాలని కోరుతూ గ్రామంలో దీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మధుసూదన్ రెడ్డి దీక్షా శిబిరాన్ని సందర్శించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. దుగినేపల్లి సొసైటీకి ఇసుక రీచ్ నిర్వహణకు తీర్మానం ఇచ్చి, చేగర్షల సొసైటీకి ఇవ్వకపోవడమే వివాదానికి కారణమని ఆయన తెలిపారు.
వారి ఆందోళన, డిమాండ్లు న్యాయమైనవని, తమ పార్టీ వారికి సంపూర్ణంగా మద్దతు ఇస్తుందని మధుసూదన్ రెడ్డి తెలిపారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు ఈ సమస్యపై దృష్టి సారించి, రెండు గిరిజన సొసైటీల మధ్య వివాదాన్ని శాంతియుతంగా పరిష్కరించాలని ఆయన కోరారు.
ఈ సమస్యపై ప్రజాప్రతినిధులు, అధికారులు దృష్టి సారించి పరిష్కరించకపోతే భవిష్యత్తులో వివాదం ముదిరి ఘర్షణలకు దారితీసే ప్రమాదం ఉందని, అటువంటి పరిస్థితులకు అధికారులే బాధ్యత వహించాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు.
వెంటనే స్పందించి రెండు సొసైటీల మధ్య వివాదాన్ని తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ (ప్రజాపందా) పినపాక మండల నాయకులు చెట్టుపల్లి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.









