భద్రాద్రి కొత్తగూడెం, 2026-07-25
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను కాంగ్రెస్ ప్రభుత్వం ఎడారిగా మారుస్తోందని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి అన్నవరపు సత్యనారాయణ తీవ్రంగా విమర్శించారు. ముగ్గురు మంత్రులు ఉన్నా, ప్రాజెక్టుల పట్ల నిర్లక్ష్యం వహిస్తూ, నీటిని తరలించి జిల్లాకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు.
ఉమ్మడి జిల్లా పేరుతో ముగ్గురు మంత్రులు ఉన్నా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను ఎడారిగా మారుస్తున్నారని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి అన్నవరపు సత్యనారాయణ విమర్శించారు.
శనివారం చర్ల మండలం తాళి పేరు ప్రాజెక్టు కాలువలను తెలంగాణ రైతు సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి అన్నవరపు సత్యనారాయణ మాట్లాడుతూ, సీతారామ ప్రాజెక్టు ద్వారా ఈ జిల్లాలో మూడున్నర లక్షల ఎకరాలకు సాగునీరు అందించి సస్యశ్యామలం చేయాల్సిన ప్రభుత్వం ప్రాజెక్టుల పట్ల చవితి తల్లి ప్రేమ చూపిస్తుందని అన్నారు.
ప్రాజెక్టును పూర్తి చేయకుండా, సబ్ కెనాల్స్ తవ్వకుండా మెయిన్ కెనాల్స్ నుంచి సాగర్ కు నీరు తీసుకుపోవడం సరైనది కాదని ఆయన అన్నారు. దీనికి తోడు దుమ్ముగూడెం, చర్ల మండలాల్లో 24,700 ఎకరాల సాగుకు కావలసిన తాళి పేరు ప్రాజెక్టు నుండి నీటిని గోదావరి గుండా దారి మళ్లించి, సీతారామ మెయిన్ కెనాల్ నుండి సాగర్ కెనాల్ లో కలపడం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు తీవ్ర అన్యాయం చేయడమేనని అన్నారు.
తాళి పేరు ప్రాజెక్టు కింద ఆయకట్టు మొత్తం నేడు ఎడారిగా మారే పరిస్థితి ఏర్పడిందని, దీనికి కారణం ఉమ్మడి జిల్లా పేరుతో ముగ్గురు మంత్రులు ఉండి, వారి ఆదేశాలతో అధికారులు ప్రతిరోజు 7000 క్యూసెక్కుల చొప్పున నీటిని గోదావరి ద్వారా సీతారామ మెయిన్ కెనాల్స్ నుండి తరలించకపోవడమేనని అన్నారు. ఇలా తరలించడం వల్ల ఆ ప్రాంత రైతాంగం మొత్తం తీవ్రంగా నష్టపోతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
జిల్లాను అభివృద్ధి చేయాల్సిన ప్రభుత్వం నీళ్లను దొంగిలించి, జిల్లాను అన్యాయానికి గురిచేస్తోందని, మంత్రుల నియోజకవర్గాలు, వారి మండలాలు అభివృద్ధి చేసుకుంటున్నాయని ఆయన విమర్శించారు. ఈ జిల్లాలో ప్రాజెక్టుల వల్ల భూములు సద్యంలోకి వచ్చి మంచి పంటలు పండించుకుందామని ఆశపడిన రైతులకు ప్రభుత్వ నిర్ణయాలు అశనిపాతంగా ఉన్నాయని అన్నారు. ఈ వైఖరిని తక్షణం మార్చుకోవాలని, లేకుంటే రైతాంగాన్ని సమీకరించి ప్రభుత్వ నిర్ణయాలకు, మంత్రుల ఆదేశాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు నిర్వహించాల్సి వస్తుందని హెచ్చరించారు.
తాళి పేరు ప్రాజెక్టు మేజర్, మైనర్ కాలువలను పూడిక తీయక, చెత్తాచెదారంతో నిండి ఉందని, దానివల్ల చివరి భూములకు నీరు అందే పరిస్థితి లేదని అన్నారు. తక్షణం యుద్ధ ప్రాతిపదికన తాళి పేరు ప్రాజెక్టు మేజర్, మైనర్ కాలువలను రిపేరు చేపట్టాలని డిమాండ్ చేశారు. సీతారామ ప్రాజెక్టు మేజర్, మైనర్ కాలువలకు కావలసిన నిధులు కేటాయించి, ఈ సీజన్ చివరి నాటికి నీరు అందించాలని కోరారు.
తెలంగాణ రైతు సంఘం సీనియర్ నాయకులు ఎలమంచి రవికుమార్ మాట్లాడుతూ, భద్రాచలం మాజీ శాసనసభ్యులు మొర్ల ఎర్రయ్య రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తాళి పేరు ప్రాజెక్టు నిర్మించబడిందని, ఈ రెండు మండలాల ప్రజలకు సుమారు 25వేల ఎకరాలు సేద్యంలోకి వచ్చే ప్రాజెక్టు పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం సరికాదని అన్నారు. ఈ ప్రాంతంలో ఈ ప్రాజెక్టు జీవధారగా ప్రజలకు అందుబాటులో ఉందని, ఆ ప్రాజెక్టు పట్ల నిర్లక్ష్యం వహించడంతోపాటు నీటిని తరలించుకుపోవడం సరికాదని పేర్కొన్నారు.












