కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన యూరియా యాప్ ను వెంటనే రద్దు చేయాలని, లేనిపక్షంలో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని బీఆర్ఎస్ పార్టీ మండల కన్వీనర్ దొడ్డి తాతారావు విమర్శించారు. ఎన్నికల హామీలను ప్రభుత్వం విస్మరిస్తోందని ఆరోపించారు.
చర్ల బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో దొడ్డి తాతారావు మాట్లాడుతూ, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలకు, ప్రస్తుతం చేస్తున్న పనులకు పొంతన లేదని విమర్శించారు. రైతులు పండించిన ధాన్యం కొనుగోలుపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.
కొత్తగా ప్రవేశపెట్టిన యూరియా యాప్ వల్ల గిరిజన, గ్రామీణ ప్రాంతాల రైతులకు ఇబ్బందులు తప్పవని, స్మార్ట్ ఫోన్లు లేనివారు, సాంకేతిక పరిజ్ఞానం అంతగా తెలియనివారు యూరియా పొందడం కష్టమవుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలు రాక రైతులు ఇప్పటికే నష్టపోతున్నారని, ప్రభుత్వం రైతులకు అండగా నిలవాల్సింది పోయి, ఇబ్బందులకు గురిచేస్తోందని ఆయన ఆరోపించారు. రైతులకు అవసరమైన యూరియాను ఎటువంటి షరతులు లేకుండా గతంలో వలెనే అందించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు పలువురు పాల్గొన్నారు.












