చర్ల, దుమ్ముగూడెం మండలాల్లో 'బాండు మొక్కజొన్న' పేరుతో నకిలీ విత్తనాలను విక్రయించి ఆదివాసి, పేద రైతులకు మోసం చేస్తున్న కంపెనీలు, వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ పార్టీ రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు కె. రంగారెడ్డి డిమాండ్ చేశారు.
భద్రాచలం పట్టణంలో జరిగిన పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో రంగారెడ్డి మాట్లాడుతూ, చర్ల మండలంలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన 21 మంది ఆదివాసి రైతులను ఒక వ్యాపారి ఎకరానికి 3-4 టన్నుల దిగుబడి వస్తుందని నమ్మించి నకిలీ విత్తనాలను విక్రయించాడని, అయితే దిగుబడి ఒక్క టన్ను కూడా రాలేదని తెలిపారు.
ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసి చట్టాలు అమల్లో ఉన్నప్పటికీ ఇలాంటి మోసాలకు పాల్పడటం నేరమని ఆయన అన్నారు. ఈ విషయంపై సంబంధిత రైతులు తహసీల్దార్, పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేసినా స్పందన లేకపోవడం అన్యాయమని ఆయన పేర్కొన్నారు.
ప్రభుత్వం వెంటనే స్పందించి, నకిలీ విత్తన వ్యాపారులపై, కంపెనీలపై కఠిన చర్యలు తీసుకోవాలని, రైతులకు నష్టపరిహారం ఇప్పించాలని ఆయన కోరారు. బహుళజాతి కంపెనీలను ఏజెన్సీ ప్రాంతంలో నిషేధించాలని, దొంగ చాటుగా నకిలీ విత్తనాలు అమ్మకాలు సాగిస్తే సహించేది లేదని హెచ్చరించారు.
లేదంటే, రైతులతో కలిసి ఉద్యమాలు చేపడతామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా, డివిజన్ నాయకులు పాల్గొన్నారు.












