అమలాపురం, 2026-07-03
విశాఖ స్టీల్ పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో మరణించిన పదిమంది కుటుంబాలకు కోటి రూపాయలు, క్షతగాత్రులకు 50 లక్షల పరిహారం అందించాలని, ప్రమాదంపై జ్యుడీషియల్ ఎంక్వైరీ నిర్వహించి దోషులను శిక్షించాలని కేంద్ర కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి. అమలాపురం గడియార స్తంభం సెంటర్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించి, తమ డిమాండ్లను వినిపించాయి.
విశాఖ స్టీల్ పరిశ్రమలో జరిగిన ఘోర ప్రమాదంలో మరణించిన పదిమంది కుటుంబాలకు కోటి రూపాయలు, క్షతగాత్రులకు 50 లక్షల రూపాయల పరిహారం అందించాలని, ప్రమాదంపై జ్యుడీషియల్ ఎంక్వైరీ నిర్వహించి దోషులను కఠినంగా శిక్షించాలని కేంద్ర కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి. అమలాపురం గడియార స్తంభం సెంటర్ వద్ద కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించి, మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు.
ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా అధ్యక్షులు జి దుర్గాప్రసాద్, ఏఐటీయూసీ జిల్లా నాయకులు ఉటాల వెంకటేస్, వ్యవసాయ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కే వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, విశాఖ ఉక్కు ప్రమాదానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలే కారణమని విమర్శించారు. విధానాల రూపకల్పనలో సంబంధంలేని ఆరుగురు చిరుద్యోగులను సస్పెండ్ చేసి, అసలు దోషులను రక్షిస్తున్నారని ఆరోపించారు. రిటైర్డ్ జడ్జితో న్యాయ విచారణ జరిపి అసలు దోషులను శిక్షించాలని డిమాండ్ చేశారు. ప్రమాద సమయంలో పరామర్శకు వచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, విద్యాశాఖా మంత్రి నారా లోకేష్ వ్యవహారశైలి మృతుల త్యాగాలను అవమానించేలా ఉందని అన్నారు.
గత రెండేళ్లుగా పరిశ్రమ యంత్రాలకు కనీస నిర్వహణ చేయకపోవడం, నాణ్యతలేని ఫెర్రో అల్లాయిస్ ఉపయోగించడం, 5వేల మంది కార్మికులను తొలగించడం, భద్రతా లోపాలను ఎత్తిచూపిన కార్మిక సంఘాల వినతులను పట్టించుకోకపోవడం వంటి కారణాల వల్లే ప్రమాదం జరిగిందని, ఈ ప్రమాదంలో ఏడుగురు పర్మినెంట్ కార్మికులు, ముగ్గురు కాంట్రాక్ట్ కార్మికులు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. మృతులకు 2 లక్షల పరిహారం ప్రకటించి, దేశభక్తియుత కార్మికుల త్యాగాలను మోడీ ప్రభుత్వం అవహేళన చేసిందని విమర్శించారు. విశాఖ స్టీల్ పరిశ్రమకు ఇచ్చిన 1100 కోట్ల ప్యాకేజీలో ఒక్క రూపాయి కూడా పరిశ్రమ భద్రతకు ఉపయోగించకుండా, అప్పుల పేరుతో తిరిగి తీసుకున్నారని ఆరోపించారు. 4 లేబర్ కోడ్ల పేరుతో పరిశ్రమలలో సేఫ్టీ అధికారుల తనిఖీలను ఆపేయడంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రమాదాలు నిత్యకృత్యంగా మారాయని అన్నారు.
విశాఖ ఉక్కు పరిశ్రమ వేల కోట్ల ఆస్తులను కాజేయాలనే ప్రైవేటీకరణ వ్యామోహంలో కార్మికుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని, ఎట్టి పరిస్థితుల్లోనూ పోరాడి, త్యాగాలతో సాధించుకున్న విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడుకుంటామని సంఘాలు ప్రకటించాయి. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు నిమ్మకాయల వెంకటేష్, పలివేల ఆనంద్ కుమార్, కాకి రాంబాబు, బాలకృష్ణ, పాము బాలయ్య, డి సతీష్, రాజకుమార్, సత్యనారాయణ, శివకుమార్; ఏఐటీయూసీ నాయకులు గుడాల వెంకటరమణ, కామిరెడ్డి చందర్రావు, కుడిపూడి సత్యనారాయణ, చెట్ల సత్తిబాబు, ఊగీరాల శివ, వాసర్ల సంద్రం మోహన్ తదితరులు పాల్గొన్నారు.












