Sangareddy/Sadasivpet (సహస్ర) జూలై 02
ప్రత్తిపాడు మండలం బోయపాలెం వద్ద ఎన్ హెచ్ 16 జాతీయ రహదారిపై బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు లారీలు ఎదురెదురుగా ఢీకొని మంటలు చెలరేగడంతో నలుగురు వ్యక్తులు సజీవ దహనమయ్యారు. ఈ దుర్ఘటనతో హైవేపై భారీగా ట్రాఫిక్ స్తంభించింది.
ప్రత్తిపాడు మండలం బోయపాలెం వద్ద ఎన్ హెచ్ 16 జాతీయ రహదారిపై బుధవారం తెల్లవారుజామున అత్యంత విషాదకర ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తుమ్మలపాలెం పంచాయతీ పరిధిలోని బోయపాలెం వద్ద రెండు లారీలు ఎదురెదురుగా ఢీకొని ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో నలుగురు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.
స్థానికులు, వాహనదారుల కథనం ప్రకారం.. చిలకలూరిపేట నుండి గుంటూరు వైపు వెళ్తున్న లారీ (AP 39 WF 1959) బోయపాలెం వద్ద రోడ్డు మధ్యలో డీజిల్ అయిపోయి ప్రమాదకరంగా ఆగి ఉన్న లారీ (AP 07 TC 8679)ని తప్పించబోయింది. ఆగి ఉన్న లారీ నిర్వాహకులు ఎలాంటి ప్రమాద హెచ్చరిక బోర్డులు పెట్టకపోవడంతో, వేగంగా వస్తున్న లారీ డివైడర్ను బలంగా ఢీకొని అవతలి రోడ్డుపైకి దూసుకెళ్లింది. అదే సమయంలో గుంటూరు వైపు నుండి చిలకలూరిపేట వైపు వస్తున్న మరో లారీ (AP 02 TE 2679)ని ఈ లారీ ఎదురెదురుగా ఢీకొట్టింది. ఈ తీవ్ర ఘర్షణ కారణంగా రెండు వాహనాల్లో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి.
ప్రమాదం జరిగిన వెంటనే లారీ క్యాబిన్లో ఇరుక్కుపోయిన ఒక డ్రైవర్.. "అన్నా కాపాడండి.. మంటలు ఆర్పండి.. నాకు పిల్లలున్నారు అన్నా" అంటూ పెట్టిన ఆర్తనాదాలు అక్కడున్న వారిని కలచివేసాయి. స్థానికులు కాపాడేందుకు ప్రయత్నించినా, మంటలు తీవ్రంగా వ్యాపించడంతో ఏమీ చేయలేకపోయారు. ఫైర్ ఇంజన్, పోలీస్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకోవడంలో ఆలస్యం కావడంతో క్యాబిన్లలో ఉన్నవారు సజీవ దహనమయ్యారని స్థానిక వాహనదారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో మొత్తం నలుగురు మృతి చెందినట్లు తెలుస్తోంది.
జాతీయ రహదారిపై రెండు లారీలు తగలబడిపోవడంతో హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా వాహనాలను సర్వీస్ రోడ్డు గుండా మళ్లించారు.











