కాకినాడ, 30.06.2026
కాకినాడ జిల్లాలో ఆటోల్లో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కిస్తే అరెస్టులు తప్పవని జిల్లా ఎస్పీ శ్రీ జి. బిందుమాధవ్, ఐపీఎస్ హెచ్చరించారు. ఆటో డ్రైవర్లు, విద్యార్థుల తల్లిదండ్రులకు ఆయన ప్రత్యేక కౌన్సిలింగ్ నిర్వహించి, రోడ్డు భద్రతా నిబంధనలు పాటించాలని సూచించారు.
ఆటోల్లో అనుమతించిన పరిమితికి మించి విద్యార్థులను లేదా ప్రయాణికులను ఎక్కించడం చట్టవిరుద్ధమే కాకుండా ప్రాణాంతకమని కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ జి. బిందుమాధవ్, ఐపీఎస్ స్పష్టం చేశారు. కాకినాడ జిల్లా పోలీసు కార్యాలయంలో సుమారు 300 మంది ఆటో డ్రైవర్లు, విద్యార్థుల తల్లిదండ్రులకు ఆయన ప్రత్యేక కౌన్సిలింగ్ నిర్వహించారు.
గతంలో అధిక సంఖ్యలో విద్యార్థులను ఆటోలో తీసుకెళ్లడం వల్ల జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక చిన్నారి మృతి చెందిన ఘటనను గుర్తుచేస్తూ, అలాంటి విషాదాలు పునరావృతం కాకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. పరిమితికి మించి విద్యార్థులను ఎక్కించే ఆటో డ్రైవర్లపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు అవసరమైతే అరెస్టు కూడా చేస్తామని హెచ్చరించారు.
తక్కువ ఖర్చు కోసం అధిక సంఖ్యలో పిల్లలను ఒకే ఆటోలో పంపించకుండా, అవసరమైతే అదనపు చార్జీ చెల్లించి అయినా భద్రతకు ప్రాధాన్యత ఇచ్చే వాహనాల్లోనే తమ పిల్లలను పాఠశాలకు పంపించాలని విద్యార్థుల తల్లిదండ్రులకు సూచించారు. పిల్లల ప్రాణ భద్రత అందరి బాధ్యత అని, రోడ్డు భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించడం ద్వారా మాత్రమే ప్రమాదాలను నివారించగలమని జిల్లా ఎస్పీ పేర్కొన్నారు. ఆటో డ్రైవర్లు, తల్లిదండ్రులు పరస్పర సహకారంతో విద్యార్థుల సురక్షిత ప్రయాణాన్ని నిర్ధారించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో కాకినాడ అడిషనల్ ఎస్పి (అడ్మిన్) డాక్టర్ మహంతి కిషోర్ కుమార్, కాకినాడ సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ శ్రీ పాటిల్ దేవరాజ్ మనీష్, ఐపిఎస్, ఎస్బి డిఎస్పీ శ్రీ కెవివి సత్యనారాయణ, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు శ్రీ ఎన్ రమేష్, శ్రీ డి రామారావు, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.








