గన్నవరం విమానాశ్రయంలో వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం లబ్ధిదారులైన మహేష్, వినీల దంపతులు తమ కుమార్తె ధన్సికతో కలిసి వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ను కలిశారు. 2019లో తమ కుమార్తెకు ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా జరిగిన న్యూరో సర్జరీకి వారు కృతజ్ఞతలు తెలిపారు.
నూజివీడు నియోజకవర్గం కొర్లగుంటకు చెందిన మహేష్, వినీల దంపతులు తమ కుమార్తె ధన్సిక రెండు నెలల పాపగా ఉన్నప్పుడు తీవ్ర అనారోగ్యానికి గురైందని తెలిపారు. ఆ సమయంలో ఏలూరులోని ఆశ్రం ఆసుపత్రిలో వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం కింద అత్యంత క్లిష్టమైన న్యూరో సర్జరీ ఉచితంగా జరిగిందని, ఆ చికిత్సతో తమ కుమార్తె కోలుకుందని శ్రీ వైయస్ జగన్కు వివరించారు.
ఆపరేషన్ అనంతరం తమ కుమార్తె ఆరోగ్యంగా పెరుగుతోందని, నాడు తమ కుటుంబానికి అందిన సహాయాన్ని జీవితంలో మరిచిపోలేమని మహేష్, వినీల దంపతులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో శ్రీ వైయస్ జగన్ను గన్నవరం విమానాశ్రయంలో కలిసి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ సందర్భంగా చిన్నారి ధన్సికను ఆప్యాయంగా పలకరించిన శ్రీ వైయస్ జగన్, ఆమె ఆరోగ్య పరిస్థితిని తల్లిదండ్రులను అడిగి తెలుసుకున్నారు. బాగా చదువుకోవాలని చిన్నారికి సూచించి ఆశీర్వదించారు. చిన్నారి, ఆమె తల్లిదండ్రుల కోరిక మేరకు వారితో కలిసి సెల్ఫీ దిగారు.
వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ద్వారా తమ కుమార్తెకు అందిన వైద్య సహాయాన్ని ఎన్నటికీ మరిచిపోలేమని, తమ కుటుంబానికి జరిగిన మేలుకు ఎప్పటికీ రుణపడి ఉంటామని మహేష్ కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. వైయస్ జగన్తో సెల్ఫీ దిగిన అనంతరం వారు సంతోషం వ్యక్తం చేశారు.








