అరెస్టు చేసేందుకు ప్రయత్నించిన పోలీసులపై కొడవలితో దాడికి యత్నించిన ఓ హిస్టరీషీటర్పై పోలీసులు కాల్పులు జరిపి అదుపులోకి తీసుకున్నారు. తమిళనాడులోని చెన్నై సమీపంలోని మణిమంగలం పోలీస్ స్టేషన్ పరిధిలోని కరసంగల్ అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. నిందితుడిపై 20కి పైగా క్రిమినల్ కేసులున్నాయి.
మదంబాక్కం ప్రాంతానికి చెందిన మహ్మద్ సద్దాం హుస్సేన్ (29)పై 20కి పైగా క్రిమినల్ కేసులున్నాయి. 2022లో మదంబాక్కం పంచాయతీ అధ్యక్షుడు వెంకటేశన్ హత్య కేసులోనూ అతడు ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. గంజాయి విక్రయానికి సంబంధించిన కేసులో 2025 నుంచి పరారీలో ఉన్న అతడిపై రెండు కోర్టు వారెంట్లు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
కరసంగల్ అటవీ ప్రాంతంలోని ఓ పాడుబడిన ఇంట్లో సద్దాం హుస్సేన్ దాక్కున్నట్లు సమాచారం అందడంతో మణిమంగలం పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి అక్కడికి వెళ్లారు. శుక్రవారం తెల్లవారుజామున అతడిని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించిన పోలీసులపై, కొడవలితో కానిస్టేబుల్ సతీశ్కుమార్పై దాడికి యత్నించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో కానిస్టేబుల్ చేతికి గాయాలయ్యాయి.
పోలీసుల హెచ్చరికలను పట్టించుకోకుండా నిందితుడు పారిపోయేందుకు ప్రయత్నించడమే కాకుండా, మరోసారి దాడికి యత్నించినట్లు అధికారులు తెలిపారు. దీంతో సబ్ ఇన్స్పెక్టర్ మురుగన్ ఆత్మరక్షణ కోసం కాల్పులు జరపగా, సద్దాం హుస్సేన్ ఎడమ కాలికి మోకాలి కింది భాగంలో బుల్లెట్ తగిలింది. అనంతరం అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
తొలుత తాంబరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించిన అనంతరం చెన్నైలోని రాజీవ్ గాంధీ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు. అతడు దాక్కున్న ఇంటి నుంచి పోలీసులు నాలుగు దేశీయ బాంబులు, మూడు కొడవళ్లు, 23 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
పేలుడు పదార్థాలు ఎక్కడి నుంచి వచ్చాయి, వాటిని ఏదైనా దాడికి ఉపయోగించేందుకు సిద్ధం చేశారా, అతడికి సహకరించిన వారు ఎవరనేది అంశాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.







