కోనసీమ జిల్లాను మాదక ద్రవ్యాల రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు అన్ని శాఖలు సమన్వయంతో కఠిన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డా. ఆర్. మహేష్ కుమార్ ఆదేశించారు. యువత, విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న డ్రగ్స్ రవాణా, విక్రయాలపై ఉక్కుపాదం మోపాలని ఆయన సూచించారు.
జిల్లా కలెక్టర్ డా. ఆర్. మహేష్ కుమార్ ఆదేశాల మేరకు, మాదక ద్రవ్యాల నిర్మూలనకు పోలీసులు, ఎక్సైజ్ శాఖలు ప్రత్యేక నిఘా పెట్టి, అనుమానిత ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలి. గంజాయి, ఇతర నిషేధిత మత్తు పదార్థాల రవాణాను అడ్డుకోవాలని సూచించారు.
వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా మత్తు మాత్రలు, సిరప్‌ల విక్రయాలను అరికట్టాలని, నిబంధనలు ఉల్లంఘించే మెడికల్ షాపుల లైసెన్సులను రద్దు చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. పాఠశాలలు, కళాశాలల పరిసరాల్లో డ్రగ్స్ విక్రయాలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
విద్యార్థులకు డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాలపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, మత్తు పదార్థాలకు బానిసలైన వారికి కౌన్సిలింగ్, డీ-అడిక్షన్ సెంటర్ల ద్వారా పునరావాసం కల్పించాలని సూచించారు.
ఈ లక్ష్యాన్ని సాధించడంలో ప్రతి శాఖ బాధ్యతగా పనిచేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. జిల్లాను మాదక ద్రవ్యాల రహిత ప్రాంతంగా మార్చడానికి సమష్టి కృషితో ముందుకు సాగాలని ఆయన కోరారు.











